ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యతిరేకంగా గొంతెత్తితే చాలు.. ఎంతటివారైనా కటకటాలపాలు కావాల్సిందేనా! - సీఐడీ

TDP LEADRES ARREST: పాము పగబడితే.. కాటేసే దాకా వెంటాడుతుందంటారు. అది ఎంతవరకు నిజమోకానీ.., ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పగబడితే మాత్రం.. దాదాపుగా అలాగే ఉంటుంది. అరెస్టు చేసి జైల్లో పెట్టించే వరకు వీలైతే లాఠీలతో కొట్టించే వరకు వదిలిపెట్టరు. ప్రభుత్వానికి, తనకు వ్యతిరేకంగా గొంతెత్తితే చాలు.. ఎంతటివారైనా కటకటాలపాలు కావాల్సిందే. చంద్రబాబు, లోకేశ్‌ తప్ప తెలుగుదేశంలో మిగిలిన నేతలంతా జగన్‌ ప్రతీకారాన్ని చవిచూసిన వాళ్లే. ఇవాళ కాకపోతే రేపు, లేదంటే ఆ తర్వాతి రోజు.. అందరి వంతు వస్తుందని నేతలంతా ఫిక్స్‌ అయిపోయేంతగా ఎవర్నీ వదలకుండా కేసులతో వేధిస్తున్నారు. చట్టంతో పని లేకుండా, నిబంధనలతో నిమిత్తం లేకుండా.. అడ్డగోలు కేసులతో అరెస్టు చేస్తూ.. కోర్టులు చీవాట్లు పెడుతున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఉస్కో అంటే చాలు కాస్కో అంటూ ఎగబడిపోతున్న సీఐడీని అడ్డుపెట్టుకుని.. వేధింపుల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు.

TDP LEADRES ARREST
తెదేపా నేతల అరెస్టు

By

Published : Nov 5, 2022, 2:25 PM IST

TDP LEADRES ARREST: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలు.. ఇటీవల సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి వరకు తెలుగుదేశం నేతల అరెస్టుల పర్వం టీవీ సీరియల్‌లా కొననసాగుతూనే ఉంది. ఏ రోజు, ఏ సమయంలో, ఎవరిని అరెస్టు చేస్తారో తెలియదన్నంతగా.. ముఖ్యనేతలందర్నీ జైలుకు పంపుతూనే ఉన్నారు. అర్ధరాత్రి, అపరాత్రి.. వృద్ధులు, అనారోగ్య బాధితులనే పట్టింపు లేకుండా.. ఎవర్ని పడితే వాళ్లను, ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తుకుపోతూనే ఉన్నారు. ఎందుకు తీసుకెళుతున్నారో, ఎక్కడికి తీసుకెళతారో కూడా చెప్పకుండా.. సీఐడీ కేసులతో వేధిస్తూనే ఉన్నారు.

తెలుగుదేశం ముఖ్యనేతల్లో ముందుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై గురిపెట్టారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్​ఐ ఆసుపత్రులకు మందులు, వైద్యపరికాల కొనుగోలులో అక్రమాల జరిగాయంటూ కేసు పెట్టారు. అనుకుందే తడువుగా అరెస్టుకు స్కెచ్ వేశారు. 2020 జూన్ 12వ తేదీన తెలతెలవారుతున్న సమయాన.. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామాన్ని చుట్టుముట్టారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఎక్కడి మనిషి అక్కడ ఆగియేంతలా.. ఊరి పొలిమేరల నుంచి అచ్చెన్న పడక గది దాకా అడుగడుగునా బలగాలను దించేశారు. మొలల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నను.. కనీసం టిఫిన్ తిని, మందులు వేసుకునేందుకు కూడా అనుమతించకుండా.. అరెస్టు చేసి పోలీస్ వాహనంలో విజయవాడకు తరలించారు. మార్గం మధ్యలో తీవ్ర రక్తస్రావమైనా కనికరించకుండా.. అర్ధరాత్రి దాటాక 1.20 గంటల వరకు ప్రయాణం సాగించారు. ఆ సమయాన మంగళగిరిలో జడ్జి ముందు హాజరుపరిచగా.. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నఅచ్చెన్నను.. ఆ తర్వాత రోజు ఉదయం 7 గంటలకు గుంటూరు జీజీహెచ్​లో చేర్పించారు.

తెలుగుదేశం సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు విషయంలోనూ సీఐడీ హద్దులు మీరింది. సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఆర్థిక, పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో నరేంద్రపై కేసు పెట్టింది. యుద్ధానికి వెళుతున్నట్లుగా 2021 ఏప్రిల్‌ 23న ఆయన ఇంటిపైకి వెళ్లింది. తెల్లవారుజామున 4 గంటలకే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడికి వరుస కట్టిన పోలీసులు.. ఆరున్నరకు ఇంట్లోకి అడుగుపెట్టారు. సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌ లాగేసుకుని.. మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులతో కాలింగ్‌ బెల్‌ కొట్టించారు. నరేంద్ర భార్య జ్యోతిర్మయి తలుపు తీయగానే లోపలికి చొరబడ్డారు. నరేంద్ర కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినట్లు తెలుసుకుని.. బాత్‌రూమ్‌ వద్దే కాపు కాశారు. తలుపు కొట్టి ఆయన బయటికి రాగానే అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. రోజంతా విచారణ చేశాక రాత్రికి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నరేంద్రకు రిమాండ్‌ విధిస్తూ అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు జడ్జి ఆదేశాలు ఇవ్వగా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింంచారు.

వైకాపా అధికార పగ్గాలు చేపట్టాక.. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎన్ని కేసులు పెట్టారో, ఎన్నిసార్లు అరెస్టు చేశారో లెక్కేలేదు. ఒక కేసులో ప్రభాకర్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం.. రిమాండ్‌లో ఉండగానే పీటీ వారెంట్‌పై మరో కేసులో అరెస్ట్‌ చేయడం.. ఇలా ఎన్నిసార్లు జరిగిందో చెప్పడమూ ఆసాధ్యమే. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో అప్పటికే బెయిల్‌పై ఉన్న చింతమనేనిపై.. 2019 ఆగస్ట్ 29న మరో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత చింతమనేని బాధితుల పేరిట ఎస్పీకి ఫిర్యాదు అందడంతో.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఆయన్ను అరెస్ట్‌ చేసిన జైలుకు పంపారు. లోపల ఉండగానే సెప్టెంబర్ 25న రెండు కేసుల్లో, అక్టోబర్ 7న ఇంకో రెండు కేసుల్లో అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి ఎక్కడ బయటికి వస్తారోనని.. కోడి పందేల కేసులో అక్టోబర్ 16న మరోసారి అరెస్ట్‌ చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. చింతమనేనిపై కేసులు, అరెస్టుల చిట్టా కొండవీటి చాంతాడంత ఉంటుంది.

మాజీ మంత్రి పీ నారాయణ అరెస్ట్ సమయంలో పోలీసులు కనీస మర్యాద పాటించలేదు. 2022 మే నెలలో 10వ తేదిన హైదరాబాద్‌లో కుమారుడి వర్ధంతికి వెళుతుండగా.. నడిరోడ్డుపై అడ్డగించి అరెస్టు చేశారు. వర్ధంతి కార్యక్రమం ముగిశాక వస్తానన్నా అంగీకరించలేదు. చిత్తూరు నుంచి బృందాలుగా హైదరాబాద్‌ వెళ్లిన ఏపీ పోలీసులు.. నార్సింగి, కేపీహెచ్​బీ కాలనీ, కొండాపూర్‌ ఇళ్ల వద్ద మాటు వేశారు. ఉదయం పదిన్నరకు కొండాపూర్‌ నివాసం నుంచి కారులో బయటికి వచ్చిన నారాయణ దంపతులను.. ఐకియా వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు ఆపారు. చిత్తూరు జిల్లా నెల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి ప్రశ్నపత్నం వాట్సప్‌ ద్వారా బయటికి వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉందంటూ అరెస్టు చేశారు. మఫ్టీలో ఉన్నవాళ్లు పోలీసులో, కాదో తెలియని నారాయణ భార్య డయల్‌ 100 ద్వారా.. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు నారాయణను తీసుకెళుతున్న కారుని అనుసరించి.. కొత్తూరు వద్ద అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసుల గుర్తింపు కార్డు చూపించి ముందుకు సాగారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రెండుసార్లు అరెస్ట్‌ చేశారు. వైకాపా నేత, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ మోకా భాస్కర్‌రావు హత్య కేసులో నిందితుడంటూ.. 2020 జులై 3న మొదట అరెస్టు చేశారు. విశాఖ వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా సీతారాంపురం వద్ద మఫ్టీలోని పోలీసులు రవీంద్రను అడ్డగించారు. అక్కడే అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మచిలీపట్నం పురపాలక ఎన్నికల వేళ పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ.. 2021 మార్చి 11న తెల్లవారుజామున 5 గంటలకే రవీంద్ర ఇంటిని చుట్టుముట్టారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో ఉదయం 7 గంటల వరకు చూశారు. ఆ తర్వాత బయటికి రాగానే అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత జిల్లా కోర్టులో హాజరుపరచగా... నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారంటూ జడ్జి వెంటనే బెయిల్‌ ఇచ్చారు.

వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి బాధితుడైన మాజీ మంత్రి దేవినేని ఉమాను.. పోలీసులు అరెస్టు చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. 2021 జులై 28న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ ప్రాంతానికి వెళ్లిన ఉమా.. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికార పక్షంపై ఆరోపణలు గుప్పించారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి ఉమా వస్తున్నట్లు తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు.. గడ్డమణుగు వద్ద కాపు కాశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు... డొంక రోడ్డులో ఉమాను జీ కొండూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఉమా సహా తెలుగుదేశం నేతల కార్లపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. అతికష్టం మీద తెలుగుదేశం నేతల వాహనాల్ని జీ కొండూరు స్టేషన్‌ సమీపానికి తరలించగా.. ఇరు వర్గీయుల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలన్న పోలీసుల మాటను తిరస్కరించిన ఉమా.. ఫిర్యాదు చేశాకే కదులుతానని పట్టుబట్టారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 1.45 వరకు కారులోనే ఉండిపోయారు. ఉమాపై ఎదురుకేసు పెట్టిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్‌ చేసి నందివాడ, హనుమాన్‌ జంక్షన్‌ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌ విధించాక రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆగస్టు 4న దేవినేని ఉమాకు హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది.

విజయనగరం జిల్లా రామతీర్థంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు వేయించారంటూ.. 2021 జనవరి 20న మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావును అరెస్ట్ చేశారు. రాజాంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సమయంలో.. రాత్రి ఎనిమిదిన్నరకు భారీగా పోలీసులు కళా నివాసాన్ని ముట్టడించారు. బీపీ, షుగర్‌తో బాధ పడుతున్న 69 ఏళ్ల కళాను.. బలవంతంగా జీపులోకి నెట్టివేశారు. బతిమాలితే మందులు వేసుకోనిచ్చిన పోలీసులు.. ఆ తర్వాత విజయనగరం జిల్లా చీపురుపల్లి స్టేషన్‌కు తరలించారు. 41A నోటీసు జారీ చేసి, రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడిచిపెట్టారు.

అసెంబ్లీ ముట్టడికి గుంపులుగా రైతులను తీసుకొచ్చారని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టుచేశారు. 2020 జనవరి 20న ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు గోళ్లతో రక్కారు. ఆయన చొక్కా చించివేశారు. అలాగే రొంపిచర్లకు తరలించి.. ఆ తర్వాత వివిధ పోలీస్‌స్టేషన్లకు తిప్పారు. అర్ధరాత్రి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ను అరెస్టు చేసినప్పుడు.. ఇంటి పరిసరాల్లో అలజడి సృష్టించారు. 2021 అక్టోబర్ 20న రాత్రి 9 గంటల తర్వాత వంటగది తలుపులు పగలగొట్టి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పరుషంగా దూషించి గొడవలకు కారణమయ్యారని అభియోగం మోపారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని.. అంతర్జాతీయ ఉగ్రవాది తరహాలో అరెస్టు చేయడం విస్తుగొలిపింది. 2018 నాటి పులివెందుల ఘర్షణ కేసులో ప్రమేయం ఉందంటూ.. 2021 ఏప్రిల్‌ 3న చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయన్ను అరెస్టుచేశారు. దేశం విడిచి పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నట్లు రన్‌వే పైకి వచ్చి మరీ అరెస్ట్‌ చేయడం దారుణమని రవి మండిపడ్డారు. సీఐని దూషించారనే అభియోగంతో మాజీ విప్ కూన రవికుమార్‌ను అర్ధరాత్రి అరెస్టుచేశారు. 2021 నవంబర్ 21న సోదరుడి ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటాక తీసుకెళ్లారు. రాత్రంతా ఎచ్చెర్ల స్టేషన్‌లో ఉంచి, తర్వాతి రోజు కోర్టులో హాజరుపరచగా... షరతులతో బెయిల్‌ మంజూరైంది.

వాణిజ్యపన్నుల శాఖలో పనిచేసినప్పుడు తప్పుడు విద్యార్హత ధ్రువపత్రంతో పదోన్నతి పొందారంటూ.. తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న పెళ్లికి హాజరై ఇంటికి వచ్చిన అశోక్‌బాబును.. మప్టీలో మకాం వేసిన సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తర్వాతి రోజు రాత్రి 7 వరకు అదుపులో ఉంచుకుని.. అప్పడు కోర్టులో హాజరుపరిచారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో 250 కోట్లు చేతులు మారాయని.. జనవరి 24న ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. అందులో డీజీపీ వాటా ఎంత అని ప్రశ్నించారు. ఆ తర్వాత కాసేపటికే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. సొంత బావ సత్తిరాజురెడ్డి మృతికి కారణమమంటూ.. 2021 మార్చి 12న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుచేశారు. దాడి చేశారన్న వైకాపా కార్యకర్తల ఫిర్యాదుతో.. 2021 మే 23న అర్ధరాత్రి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందవంటూ నకిలీ ప్రకటనను సోషల్‌ మీడియాలో షేర్ చేశారంటూ.. పలాస తెలుగుదేశం నేత గౌతు శిరీషను జూన్‌ 6న విచారణ చేశారు. సుమారు 7 గంటలపాటు ప్రశ్నించినా కనీసం భోజనం కూడా పెట్టలేదు. నేరం అంగీకరించమని ఒత్తిడి చేశారని శిరీష వాపోయారు.

తెలుగుదేశం మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. అక్టోబర్‌ 12న అరెస్టుచేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీఎంవో కీలక అధికారికి సంబంధం ఉందంటూ వాట్సప్‌లో మెసెజ్‌ ఫార్వర్డ్ చేశారని అభియోగం మోపారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు నరేంద్రతో గోడ కుర్చీ వేయించి, కాళ్లపై ఎక్కి హింసించారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గొడవ జరుగుతుందని వెళ్లిన తనను కులం పేరుతో దూషించారన్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ సక్రూనాయక్‌ ఫిర్యాదుపై.. 2021 అక్టోబర్ 20న యువనేత బ్రహ్మం చౌదరిని అరెస్టుచేశారు. పోలీసులు తనను కొట్టారని, రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్‌కు చెప్పినా వైద్యపరీక్షకు పంపలేదని హైకోర్టులో బ్రహ్మం పిటిషన్‌ వేశారు. దీనిపై హైకోర్టు నివేదిక కోరింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులు ఫార్వర్డ్ చేశారంటూ.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అనుచరుడు నలంద కిశోర్‌ను 2020 జూన్‌ 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం సరిగా లేదని, ఉదయం వస్తానని చెప్పినా వినకుండా.. 65 ఏళ్ల కిశోర్‌ను విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ పూర్తయ్యాక అక్కడే వదిలేశారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆయన మరణించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకిస్తే చాలు.. అరెస్టులే..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details