ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతికి ఏపీకి అన్ని వాహనాలు వెళ్లాయా..? లెక్కలు విడుదల చేసిన పోలీసులు - హైదరాబాద్‌లో సంక్రాంతి వాతావరణం

Vehicles lined up at toll gates: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగే. ఈ పండుగకి సొంతూళ్లు వెళ్లే వారితో టోల్​గేట్ల వద్ద వాహనాలు బారులుతీరుతాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సుమారు 1.15 లక్షలు వెళ్లాయంటేనే సంక్రాంతి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. సొంతూళ్లకు వెళ్లిన వారిలో 90 శాతం మంది సొంత వాహనాలతో వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Vehicles lined up at toll gates
వాహనాల లెక్క విడుదల చేసిన పోలీసులు

By

Published : Jan 14, 2023, 8:57 PM IST

Vehicles lined up at toll gates: గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.15 లక్షల వాహనాలు వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 12న 56 వేల 500 వాహనాలు వెళ్లగా.. 13న 67వేల 500కార్లు వెళ్లినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పంతంగి టోల్‌గేట్ మీదుగా వెళ్లిన వాహనాల వివరాలను ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పండుగ కోసం వెళ్తున్న వాళ్లలో 90 శాతం మంది వ్యక్తిగత వాహనాల ద్వారానే వెళ్లినట్లు పోలీసులు వివరించారు.

రెండు రోజల్లో కలిపి 98 వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు పోలీసుల లెక్కల్లో తేలింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బీబీనగర్ టోల్​గేట్ మీదుగా నిన్న 26 వేల వాహనాలు వెళ్లాయని.. అందులో 18 వేల కార్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 13 వేలకు పైగా వాహనాలు వచ్చినట్లు తెలిపారు. ఎల్బీనగర్, ఉప్పల్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ఆర్టీసీ ప్రత్యేక బృందాల సాయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టోల్‌గేట్ల వద్ద వాహనాలను క్రమ పద్ధతిలో పంపించేందుకు జీఎంఆర్ సిబ్బంది సాయం తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ప్రజారవాణాకు తొలి ప్రాధాన్యమివ్వాలని.. గూడ్స్ వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించొద్దని పోలీసులు సూచించారు. డ్రైవర్లు సైతం వాహనం యొక్క కండీషన్‌ను పరిశీలించుకున్న తర్వాతే రహదారిపైకి రావాలని పోలీసులు తెలిపారు.

ప్రయాణికులు బస్టాండ్ల వద్దే బస్సులను, వాహనాలు ఎక్కాలని.. రహదారులపైకి పరుగెత్తుకొచ్చి వాహనాలను ఎక్కడం వల్ల ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాళ్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

కాలనీల్లో గస్తీ ముమ్మరం చేసిన పోలీసులు: మరోవైపు సంక్రాంతి దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి చాలా మంది సొంతూళ్లు వెళ్లిపోవడంతో పోలీసులు పలు కాలనీలో గస్తీ నిర్వహించారు. ముఖ్యంగా ఒంటరి ఇళ్లు, తాళాలు వేసిన ఇళ్లుపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడ దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మియాపూర్ పీఎస్ పరిధిలోని పలు కాలనీల్లో సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. మదీనాగూడా, ఆల్విన్ కాలనీ, ఉషోదయ కాలనీల్లో మియాపూర్ పోలీసులతో కలిసి కలియతిరిగారు. పండుగ సందర్భంగా కాలనీల ప్రజలు ఇళ్లకు తాళం వేసి సొంతూర్లకు వెళ్లారు.

ఇప్పటికే పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత గస్తీ నిర్వహిస్తూ.. తాళం వేసిన ఇళ్లపై నిఘా పెట్టారు. డీసీపీ శిల్పవల్లి సైతం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఉత్సాహపరిచేలా సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. ఆయా కాలనీల్లో ఉన్న సీసీ కెమెరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. పండుగకు వెళ్లిన వాళ్లు మరో మూడు రోజుల పాటు సొంతూళ్లలోనే ఉండే అవకాశం ఉండటంతో ఎక్కడా దొంగతనాలు చోటుచేసుకోకుండా పక్కాగా గస్తీ నిర్వహించాలని డీసీపీ.. తోటి సిబ్బందికి సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details