Acid Attack on Woman in NTR District Update: ఎన్టీఆర్ జిల్లాలో కలకలం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సీపీ కాంతి రాణా తెలిపారు. ఆదివారం ఉదయం నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మహిళపై యాసిడ్ దాడి జరగగా.. దాడికి ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు ఆమె కుమారుడు, ఆమె అక్క కూతురుకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
సీపీ కాంతి రాణా తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన తిరుపతమ్మ అనే మహిళపై.. నెల్లూరుకు చెందిన మణిసింగ్ అనే వ్యక్తియాసిడ్తో దాడిచేసినట్లు వివరించారు. తిరుపతమ్మ భర్త గతంలో మరణించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆమెకు నెల్లూరుకు చెందిన మణిసింగ్‌తో గత 8నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడిందని అన్నారు. మణిసింగ్ తిరుపతమ్మ ఇంటికి వస్తూ పోతుండేవాడని.. అంతేకాకుండా తనను వివాహం చేసుకోమని ఆమెను అభ్యర్థించేవాడని తెలిపారు.
గత కొద్ది రోజుల క్రితం అతనికి టీబీ సోకినట్లు వివరించారు. వీరద్దరికి పరిచయమున్న నేపథ్యంలో.. అతనికి టీబీ వ్యాధి సోకిన విషయం ఆమెకు తెలిసినట్లు వివరించారు. టీబీ వ్యాధి గురించి తెలియటంతో తిరుపతమ్మ, మణిసింగ్ను దూరం పెడుతూ వచ్చినట్లు వెల్లడించారు. దూరం పెట్టటంతో అతనిలో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పథకం ప్రకారమే ఆమెపై యాసిడ్ దాడి చేయటానికి పూనుకున్నట్లు వివరించారు. అందుకోసం నెల్లూరులోని బంగారం మెరుగు పెట్టడానికి వినియోగించే యాసిడ్‌ను నగల దుకాణంలో.. కొనుగోలు చేసి ఐతవరం తిరుపతమ్మ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
శనివారం రాత్రి 10 గంటలకు ఐతవరంలోని తిరుపతమ్మ ఇంటికి వెళ్లిన మణిసింగ్.. భోజనం చేసి రాత్రి అక్కడే బస చేశాడని వివరించారు. అందరూ నిద్రపోయిన తర్వాత.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అతని వెంట తీసుకువచ్చిన యాసిడ్‌ను నిద్రపోతున్న తిరుపతమ్మపై పోసినట్లు సీపీ కాంతి రాణా వెల్లడించారు. ఈ యాసిడ్ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలైనట్లు వివరించారు. యాసిడ్‌తో దాడి చేసిన అనంతరం మణిసింగ్ అక్కడి నుంచి పరారు కాగా.. స్థానికులు బాధితురాల్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఘటన సమాచారం వారికి అందటంతో బాధితురాలిని నందిగామ ఆసుపత్రి నుంచి.. మెరుగైన వైద్యం కోసం గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రికి తరలించినట్లు సిపీ తెలిపారు. ఈ దాడిలో ఆమెతోపాటు ఆమె కుమారుడు, ఆమె అక్క కుమార్తె గాయపడినట్లు ఆయన వివరించారు. ఎవరికి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.