SANKALP SIDDHI SCAM LATEST UPDATES : రాష్ట్రంలో సంకల్ప సిద్ధి గొలుసు కట్టు మోసం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అతడిని కర్ణాటకలో అరెస్టు చేసి, విజయవాడకు తీసుకొచ్చారు. విచారణ అనంతరం మూడో ఏసీఎంఎం కోర్టులో న్యాయమూర్తి రాజశేఖర్ ఎదుట హాజరుపర్చారు. కుంభకోణంలో కిరణ్ పాత్ర ఉన్నందున అరెస్టు చేసినట్లు, రిమాండ్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీపీ శశికళ కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈనెల 25వరకు నిందితుడికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక కారాగారానికి తరలించారు.
సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత కిరణ్ విజయవాడ నుంచి కర్ణాటక పారిపోయాడు. అతని కోసం పలు బృందాలతో పోలీసులు గాలించినా దొరకలేదు. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో స్నేహితుల వద్ద ఆశ్రయం తీసుకున్నాడు. ఇటీవల కిరణ్ కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్‌పై పోలీసులు నిఘా పెట్టారు. ఈ సందర్భంగా వారి ఫోన్ల నుంచి కిరణ్ మిత్రులకు వెళ్తున్నట్లు గుర్తించారు. వాటిని వడపోసి, ఎట్టకేలకు నిందితుడి ఆచూకీ కొనుగొని అదుపులోకి తీసుకున్నారు. మరింత లోతైన విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసులు తమ కస్టడీ తీసుకుని విచారించేందుకు సమాయత్తం అవుతున్నారు. దీని కోసం త్వరలో కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ మనీ సర్క్యులేషన్ కేసులో.. ప్రధాన నిందితుడు గుత్తా వేణుగోపాల్‌తోపాటు.. గుత్తా కిషోర్, మావూరి వెంకట నాగలక్ష్మి, గంజాల లక్ష్మీ.., సయ్యద్ జాకీర్ హుస్సేన్‌లను పోలీసులు 2022 నవంబర్28న అరెస్టు చేశారు.