NTR distric Munneru project latest news: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు జలయజ్ఞం కార్యకమంలో భాగంగా మొదటి ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి వద్దనున్న మున్నేరు ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి నిర్ణయించారు. దీంతో ఆయా ప్రాంత రైతులు ప్రాజెక్ట్ పూర్తయితే తమకు సాగునీరు అందుతుందని ఎంతో ఆనందపడ్డారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను గాలికొదిలేశాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మున్నేరు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారని భావించిన ఆ ప్రాంత రైతులంతా.. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి గెలిపించారు. సీఎంగా జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా కూడా నేటీకి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. 2012లో వరదలకు ఏర్పడినా గండి పూడ్చడానికి రూ. 5.25 కోట్లతో పనులను ప్రారంభించినప్పటికీ అవి మధ్యలోనే నిలిచిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మున్నేరు ప్రాజెక్ట్‌పై రైతుల ఆశలు నిరాశలు.. ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి (దివంగత రాజశేఖర్ రెడ్డి) ప్రారంభించిన ప్రాజెక్ట్‌ని కుమారుడు ముఖ్యమంత్రి అయితే పూర్తి చేస్తారన్న నమ్మకంతో మున్నేరు ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రాంత రైతులు ఓట్లేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా సీఎం జగన్.. నేటికీ ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చిన.. సామనేని ఉదయబాను మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో మున్నేరు ప్రాజెక్ట్ పూర్తయితే తమ పొలాలకు సాగునీరు అందుతుందని.. రైతులు పెటుకున్న ఆశలు గత కొన్నేళ్లుగా నిరాశగానే మిగిలిపోయాయి. ఈ ప్రాజెక్ట్ గనక పూర్తయితే.. ఇటు ఆంధ్ర ప్రాంత రైతులు అటు తెలంగాణ రాష్ట్రంలోని రెండు మండలాల రైతులకు లాభం చేకూరుతుందని రైతులు తెలియజేశారు.
బ్రిటీష్ హయాంలో మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం.. మున్నేరు ప్రాజెక్టు పూర్తయితే.. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో సుమారు 80వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించవచ్చు. రెండు నియోజకవర్గాల్లో ఇంచుమించు అన్ని మండలాల్లో రెండు పంటలు సాగవుతాయి. ప్రాజెక్టు పూర్తిచేస్తే ఆయకట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చవచ్చు. తెలుగుదేశం పాలనలో నేతలు చొరవ చూపినప్పటికీ పనులు చేపట్టలేకపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమైనా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.