Munugode byelection: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇంకా ప్రచారానికి ఏడు రోజుల సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన చాలా మంది ఇన్‌ఛార్జ్‌లు దీపావళి పండుగ నిమిత్తం రెండు రోజుల పాటూ సొంత ప్రాంతాలకు వెళ్లారు.
దీంతో గత రెండు రోజుల పాటూ క్షేత్రాస్థాయిలో అన్ని పార్టీలు అంతంతమాత్రంగానే ప్రచారం నిర్వహించాయి. తాజాగా వారందరూ తిరిగి మునుగోడు నియోజకవర్గానికి చేరుకోవడంతో క్షేత్రస్థాయిలో మళ్లీ సందడి మొదలైంది. చండూరు పురపాలిక పరిధి సమీపంలోని బంగారిగడ్డ వద్ద ఈ నెల 30 సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రచారం ముగిసే గడువుకు రెండు రోజుల ముందు జరిగే ఈ సభ ద్వారా తెరాస తమ ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లనుంది.
జేపీ నడ్డా బహిరంగ సభ: ఈ నెల 31 జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభ నిర్వహించాలని భాజపా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మునుగోడు, చండూరు మధ్యలో సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. సభా వేదికను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా మునుగోడులోనే మకాం వేసి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీపావళి సందర్భంగానూ నియోజకవర్గంలోనే మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నడ్డా సభ ద్వారా గత నెల రోజుల నుంచి ఉద్ధృతంగా సాగుతున్న ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తామని, ఆ సభ, పార్టీ విజయోత్సవ సభలాగా భారీ ఎత్తున జనసమీకరణతో నిర్వహించేందుకు పావులు కదుపుతోంది.
మునుగోడులో రెండు రోజుల పాటూ: కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ముందు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఈ నెల 27, 28వ తేదీల్లో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులతో పాటూ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పాదయాత్ర చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.