అసలే వేసవి.. ఎండలు మండిపోతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గృహ వినియోగదారులతోపాటు రైతులు సైతం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు సైతం విద్యుత్ కోతలపై యుద్ధం ప్రకటించాయి. తెదేపా ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా:ఇష్టారాజ్యంగా విధిస్తున్న కరెంట్ కోతలతో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అంధకారం అలుముకుందని స్థానికులు వాపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో సైతం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండడంతో.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆధారిత వ్యాపారం చేస్తున్న డైరీ, ఐస్ వ్యాపారులు, జ్యూస్, జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. ఈ విద్యుత్ కోతల బారిన పడి తాము చదువుకునే పరిస్థితి లేదని విద్యార్థులు సైతం ఆవేదన చెందుతున్నారు.
అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజల ఆగ్రహం ఏలూరు జిల్లా:విద్యుత్ కోతలతో తీవ్రంగా పంట నష్టపోతున్నామంటూ ఏలూరు జిల్లా కామవరపుకోటలో రైతులు ఆందోళనకు దిగారు. అప్రకటిత విద్యుత్ కోతలతో వేసిన పంటలన్నీ నీరందక ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించారు. అధికారులు వచ్చి నచ్చచెప్పినా.. రైతులు వినకపోవడంతో వ్యవసాయానికి 9 గంటలు, గృహ అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. హామీ ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ కష్టాలు తీవ్రంగా వేధిస్తున్నాయని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ప్రాజెక్టు సందర్శన యాత్రకి వచ్చిన భాజపా నాయకుల దృష్టికి విద్యుత్ కష్టాలను సంక్షేమ సంఘం నాయకులు తీసుకెళ్లారు. రాత్రి బస చేసిన నాయకులను కలిసి పరిస్థితిని వివరించారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తెదేపా పలుచోట్ల నిరసనలు పలుచోట్ల తెదేపా నిరసనలు :పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ఆందోళన చేపట్టింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు నిరసనగా.. భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైకాపా పాలనలో సామాన్య ప్రజలు జీవన స్థితిగతులు అధ్వాన్నంగా మారాయని నాయకులు వాపోయారు. పార్వతీపురం జిల్లా సాలూరులో తెదేపా నాయకులు రడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. లాంతర్లు పట్టుకుని నిరసన తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తెదేపా ఆందోళనకు దిగింది. విసనకర్రలు, లాంతర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా భాజపా నిరసనలు భాజపా నిరసనలు :విద్యుత్ కోతలు.. దానికి తోడు అధిక కరెంటు ఛార్జీలను నిరసిస్తూ.. బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ కేంద్రం వద్ద.. భాజపా శ్రేణులు నిరసన చేపట్టాయి. అప్రకటిత విద్యుత్ కోతలపై మండిపడుతూ.. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అసలే కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. పెరిగిన ఛార్జీలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఇలా కోతలు విధించడం దారుణమని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: Jagananna Vasathi Deevena: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: సీఎం జగన్