ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు People Panic Of Garbage due to Municipal Workers Strike: పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెతో ఎటూచూసిన రాష్ట్రంలో చెత్తే దర్శనం ఇస్తోంది. ప్రజల ముక్కుపుటలు అదిరిపోతున్నాయి. 35 వేల మందికి పైగా పొరుగు సేవల కార్మికులంతా సమ్మెలో పాల్గొనటంతో ఇళ్ల ముందు, వీధులకు ఇరువైపులా చెత్త పోగు పడుతోంది. ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నామమాత్రంగా ఉంది. దీంతో నగరాల్లో చెడువాసనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కరోనా భయాలూ వారిని వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య సమస్యతో దోమలు బెడద ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కార్మికులతో చర్చించినా సమ్మెకు ముగింపు పలికేలా చేయలేకపోయింది.
సమస్యలు పరిష్కరించండి లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం: పారిశుద్ధ్య కార్మికులు
రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో రోజూ 5,676 టన్నులకు పైగా వ్యర్థాలు ఇళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి రోడ్లపైకి వస్తుంటాయి. గత నెల 26న సీఐటీయూ ఆధ్వర్యంలోని ఏపీ మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ప్రభుత్వం దీన్ని తేలికగా తీసుకుని, సమ్మెలో పాల్గొనని మిగతా కార్మికుల సాయం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సమస్యను సులువుగా అధిగమించ వచ్చని భావించింది. ఈలోపు ఏఐటీయూసీ, ఇతర సంఘాల సంయుక్తంగా ఏర్పడిన ఐకాస ఆధ్వర్యంలోని కార్మికులు కూడా ఈనెల 7 నుంచి సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి షాకిచ్చాయి. పుర, నగరపాలక సంస్థల్లో చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమ్మెలోని కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో 123 పట్టణ, స్థానిక సంస్థల్లోను పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది. వేలాది టన్నుల వ్యర్థాలు రహదారులపై చిందరవందరగా పడి ఉంటున్నాయి. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలోని క్లాప్ ఆటోలతో ఇళ్ల నుంచి చెత్త సేకరించే ప్రక్రియ అత్యధిక చోట్ల తూతూమంత్రంగా సాగుతోంది. ప్రధాన నగరాల్లో పారిశుద్ధ్యసమస్య అత్యంత తీవ్రంగా ఉంది.
Sanitization Staff Protest: పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు
సమ్మె ప్రారంభించాక కార్మిక సంఘాలతో మంత్రుల బృందం ఇప్పటివరకు మూడు సార్లు చర్చించినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీపై మంత్రులు మాట్లాడటం లేదు. వేతనం పెంచాలన్న డిమాండ్‌పైనా తెలివిగా వ్యవహరించడంతో కార్మిక సంఘాలు మెట్టు దిగడం లేదు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులకు ప్రతి నెలా రూ.6 వేలు చొప్పున ప్రభుత్వం ఆరోగ్య భృతి ప్రకటించి 2019 ఆగస్టు నుంచి అమలు చేస్తోంది. పట్టణ, స్థానిక సంస్థలు కార్మికులకు ఇస్తున్న వేతనంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆరోగ్య భృతి అందిస్తోంది. దీన్ని జీతంగానే పరిగణించాలని కార్మిక సంఘాలతో శనివారం జరిగిన చర్చల సందర్భంలో మంత్రులు ప్రస్తావించడం ద్వారా సమస్య మరింత జటిలమైంది. ఆరోగ్య భృతిని జీతంగా పరిగణించలేమని, కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.15 వేల వేతనం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మంత్రుల బృందం నుంచి స్పందన లేకపోవడంతో మూడుసార్లు జరిగిన చర్చలూవిఫలమయ్యాయి. జీతం పెంచాలన్న ప్రధాన డిమాండ్‌నే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.
'సమస్యలపై మేము రోడ్డెక్కాం - పట్టించుకోకుండా సీఎం జగన్ ఆడుకుంటున్నారు'
2022 జులై 11 నుంచి 15 వరకు కార్మికులు చేసిన నిరవధిక సమ్మెపైనా అప్పట్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి మినహా మితగావి ఇప్పటికీ అమలు కాలేదు. 23 డిమాండ్లూ దశల వారీగా పరిష్కరిస్తామని చర్చల సందర్భంలో మంత్రులు అప్పట్లో హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. రూ. 6 వేల ఆరోగ్య భృతిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. 2022 జనవరి నుంచి జులై వరకు చాలామంది కార్మికులకు భృతి నిలిపివేశారు. సమ్మె చేయడంతో తిరిగి కొనసాగించారు. మిగతా 22 డిమాండ్లపై ఇప్పటికీ మళ్లీ చర్చ జరగలేదు. పరిష్కారం చూపలేదు. దీంతో శనివారం జరిగిన చర్చల్లోనూ కార్మిక సంఘాల నేతలు కొందరు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సమస్యల పరిష్కారం కోసం ఇచ్చే హామీలపైనా జీవోలు వెంటనే ఇవ్వాలని తేల్చిచెప్పారు.