Sankranti festivities in AP: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేట దేవాంగుల వీధిలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. ముగ్గుల పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. కోనసీమ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పండుగ శోభతో కళకళలాడాయి. సహపంక్తి భోజనాలు, ముచ్చట్లతో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చినాపెద్దా ఉల్లాసంగా గడిపారు.
గుంటూరు జిల్లా: గాలిపటాల పండుగ సందడిగా సాగింది. గోరంట్లలోని హోసన్నా మందిరం సమీపంలోని మైదానంలో పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు. కాకుమానులో చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా మాజీ న్యాయమూర్తి చుక్కా రిచల్ దేవవరం పోటీల్లో గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. మొత్తం 25 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఏటా సంక్రాంతి వేళ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పల్నాడు జిల్లా: నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఊరంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్, శివశక్తి గ్రూప్ సంస్థల ఎండీ నందిగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. నరసరావుపేటలోని కోడెల మైదానంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ గాయని సునీత పాటలకు కలెక్టర్, ఎమ్మెల్యే నృత్యాలు చేసి అందరినీ అలరించారు.
వైఎస్సార్ కడప జిల్లా:వేంపల్లెలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాలలో వెంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వామివారి రథాన్ని లాగారు. మహిళల కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాల నృత్యాలు అలరించాయి. కర్నూలులో వైశ్య ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సంక్రాంతిని సందడిగా జరుపుకున్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
విజయవాడ: సంక్రాంతిని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీశైలం మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామికి రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.