ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ ఆసుపత్రికి సుస్తి చేసింది.. రోగులను పట్టించుకునే నాథుడు ఎక్కడ..! - ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు

VIJAYAWADA GOVT HOSPITAL: వైద్యం కోసం రోగులు ఆస్పత్రికి వస్తే.. కనీసం అంబులెన్స్‌లో నుంచి కిందికి దించి.. లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు కనీసం వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లు సైతం సరిగా లేకపోవడంతో రోగుల బంధువులే వారిని నానా ఇబ్బందులు పడి తీసుకెళ్లాల్సి వస్తోంది. కనీసం లోపలికి వెళ్లాక ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో ఉంటున్నారు. ఇదీ ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి.

Vijayawada government general hospital
Vijayawada government general hospital

By

Published : Dec 22, 2022, 10:24 AM IST

VIJAYAWADA GOVT HOSPITAL : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఔట్‌పేషెంట్‌ విభాగానికి వచ్చే రోగులే రోజుకు కనీసం రెండు వేల మందికి పైగా ఉంటున్నారు. రాష్ట్రంలోనే కీలకమైన ఆసుపత్రిగా మారడంతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఆయా జిల్లాల ఆసుపత్రుల నుంచి తీవ్రమైన కేసులన్నీ విజయవాడకే పంపిస్తున్నారు. దీనికితోడు రోడ్డు ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్య సమస్యల బాధితులనూ విజయవాడ సర్వజనాసుపత్రికే తరలిస్తున్నారు.

రోగుల తాకిడి పెరిగినా.. కిందిస్థాయి సిబ్బంది సంఖ్యను మాత్రం పెంచడం లేదు. క్షేత్రస్థాయిలో రోగులకు సహాయపడే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలో స్ట్రెచర్లు, చక్రాల కుర్చీల కొరత సైతం ఎక్కువగానే ఉంది. పేద రోగులు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తే.. వారిని కనీసం లోపలికి తీసుకెళ్లేందుకు కీలక సమయాల్లో సిబ్బంది ఉండడం లేదు.

ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉండడంతో కనీసం వచ్చే రోగుల కోసం ప్రవేశ ద్వారం వద్ద కొన్ని చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచినా.. వారి కష్టం కొంతవరకూ తీరుతుంది. ఓపీకి వచ్చి చూపించుకున్న దగ్గర నుంచి వైద్యుల వద్దకు వెళ్లడం, వారు సూచించిన వివిధ వైద్య పరీక్షలు, స్కానింగ్‌ లాంటి వాటికి కూడా రోగులను వారి బంధువులే నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తోంది.

ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యుడి వద్దకు వెళ్లేందుకు చాలాసేపు నిరీక్షించాల్సి వస్తోంది. వైద్యుల గదుల ఎదుట రోగులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా లేకపోవడంతో నిల్చునే తమ పేరు వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు, గాయాలపాలైనవారు వరండాల్లో నేల మీదే కూర్చుండిపోతున్నారు. కొందరు నేలపైనే పడుకుని ఉంటున్నారు.

ఆస్పత్రిలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు సైతం పూర్తిగా కల్పించకపోవడంతో రోగులు అసహనానికి గురవుతున్నారు. కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలని చాలాకాలంగా కోరుతున్నా పట్టించుకునేవాళ్లు లేరని రోగులు వాపోతున్నారు.

ఆసుపత్రిలో రోగులు అవస్థలు.. పట్టించుకోని అధికారులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details