APSRTC Fares: ఎపీఎస్ ఆర్టీసీలో 11 వేల బస్సులున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు పల్లెవెలుగు బస్సులుండగా, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సహా అమరావతి బస్సులు ఉన్నాయి. వీటిల్లో సదుపాయాలను బట్టి బస్సు ఛార్జీలు నిర్ణయిస్తారు. కిలోమీటర్ చొప్పున.. ఒక్కో తరహా బస్సులో ఒకే విధమైన టికెట్ ధర ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ రూట్లో, ఏ డిపో బస్సైనా ఎక్కడ ఎక్కినా దిగినా.. ఒకే రేటు వసూలు చేయాలి. ఆర్టీసీ ప్రారంభించిన నాటి నుంచీ ఎన్నో ఏళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
ప్రైవేట్ వారిలా బస్సుకో రేటు, పూటకో ధర వసూలు చేసే విధానం ఏపీఎస్ ఆర్టీసీలో ఉండదనేది ప్రజలకున్న నమ్మకం. ఈ నమ్మకమే లక్షలాది ప్రజల ఆదరణ చూరగొనేలా చేసింది. ఇప్పటివరకు ఎంతో పారదర్శకంగా ఛార్టీలు వసూలు చేసిన ఆర్టీసీ.. రూటు మార్చింది. ప్రైవేటు వారిలా దోపిడీ దారి ఎంచుకుంటోంది. ఒకే రూట్లో ఒకే రకమైన బస్సులో వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల్ని దోపిడీచేస్తోంది.
మొదట విజయవాడ - విశాఖ మధ్య రూట్లో అమరావతి సర్వీసుల్లో చార్జీలను.. గుట్టుచప్పుడు కాకుండా పెంచేశారు. అమరావతి ఏసీ బస్సులో టికెట్ ధరను 738 గా నిర్ణయించారు. దీనికి టోల్, రిజర్వేషన్ చార్జీ, సెస్‌లు అంతా కలిపితే 916 రూపాయలు ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూట్లో అన్ని అమరావతి సర్వీసుల్లోనూ..ఇదే ఛార్జీ వసూలు చేయాలి. కానీ.. అడ్డదారిలో ప్రయాణికులను బాదాలని నిర్ణయించిన ఆర్టీసీ .. గుట్టుచప్పుడు కాకుండా ఈ రూట్లోని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీలు పెంచేసింది.