Paddy Cultivation Decreasing in YSRCP Government :నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరివ్వకపోవడంతో వరి నాట్లు పడలేదు. కృష్ణా డెల్టాలోనూ నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోను నీరుచేరక.. రైతులు పొలాల్ని వదిలేసిన దయనీయ స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు ( Today Rice Price) మరింత కొండెక్కే ప్రమాదం పొంచి ఉంది. అయినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆహార పంటల ఉత్పత్తి పెరుగుతోందంటూ భుజాలు చరచుకుంటున్నారు.
YSRCP Government Careless on Paddy Farmers :వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నా భరోసా కల్పించే చర్యలే కొరవడ్డాయి. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే..6 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఎకరాకు 21.50 క్వింటాళ్ల దిగుబడి ప్రకారం చూస్తే సుమారు 12 లక్షల 90వేల టన్నుల దిగుబడి తగ్గనుంది. క్వింటాల్‌కు 2వేల200 రూపాయల మద్దతు ధర ప్రకారం చూస్తే సుమారు 2వేల 800కోట్ల విలువైన పంట ఉత్పత్తి తగ్గిపోనుంది. ఎండుతున్న పంటలతో తగ్గే దిగుబడులు లెక్కలోకి తీసుకుంటే ఇది మరింత పెరగనుంది.
Crops Drying Due To Lack of Irrigation Water In Krishna Delta :రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు ఆందోళనకర స్థాయికి పడిపోయింది. కొన్నేళ్ల గణాంకాలు చూస్తే ఇంత తక్కువ విస్తీర్ణంలో ఎప్పుడూ సాగైన పరిస్థితి లేదు. 2018-19 సంవత్సరంలో కరవు పరిస్థితులున్నా రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా నమోదైంది. ఖరీఫ్‌లో 39 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈ ఏడాది కేవలం 33 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సుమారు 6 లక్షల ఎకరాలు తక్కువగా నాట్లు పడ్డాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోనే సుమారు 2లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.
నారుమళ్లను పశువుల మేతకు వదిలేసిన రైతులు : ముఖ్యంగా సాధారణ విస్తీర్ణం కంటే పల్నాడు జిల్లా 78 శాతం, ప్రకాశం జిల్లాలో 50 శాతం సాగు తగ్గిపోవడం ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది. నంద్యాల జిల్లాలో 33, YSR జిల్లాలో 32, బాపట్ల జిల్లాలో 22 శాతం విస్తీర్ణం మేర నాట్లు వేయలేదు. కృష్ణా డెల్టా చివరి భూముల్లోని ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో అధికశాతం విస్తీర్ణంలో నాట్లు వేయలేదు. నారుమళ్లను పశువుల మేతకు వదిలేశారు.