ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై సీజేఐకు వినతిపత్రం: అఖిలపక్ష పార్టీలు - సీజేఐకు వినతిపత్రం

ALL PARTY MEETING AT VIJAYAWADA : ప్రభుత్వ హింసాత్మక చర్యలపై భారత ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. విజయవాడలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట జరిగిన అఖిలపక్ష భేటీలో పలు తీర్మానాలను నేతలు ఆమోదించారు. రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి ఇది అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ALL PARTY MEETING AT VIJAYAWADA
ALL PARTY MEETING AT VIJAYAWADA

By

Published : Dec 27, 2022, 2:52 PM IST

Updated : Dec 27, 2022, 7:46 PM IST

ALL PARTY MEETING : విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలపై సీజేఐకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు.. జిల్లా, మండల స్థాయిలో పరిరక్షణ వేదిక కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని నిర్ణయించారు.

అధికారంలోకి వస్తూనే విధ్వంసంతో పాలన ప్రారంభం:ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలతో సంబంధం లేకుండా అంతా ఏకం కావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. సిద్ధాంతాలు, పార్టీలు, మనస్తత్వాలు, అభిప్రాయాలు వేరైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడదామన్నారు. అధికారంలోకి వస్తూనే విధ్వంసంతో పాలన ప్రారంభించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని అచ్చెన్న ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే.. హింసించటమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతా ఏకం కావాలని కోరారు. దుర్మార్గుడైన ఫ్యాక్షనిస్ట్​ని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఓ అవినీతి పరుడు రాష్ట్రాన్ని దోచుకుంటాడని తెలిసి కూడా ఓట్లేసి తప్పు చేసారనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

గత మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. అన్ని వర్గాల్లోనూ ఎప్పుడూ లేని వ్యతిరేకత సీఎం గమనించాడు కాబట్టే కుల, మత, ప్రాంత విద్వేషాలతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాదని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నందునే.. హింసాత్మక దాడులనే కొత్త పంథా ఎంచుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ముఖ్యమంత్రి కొత్త పంథాను ఎంచుకున్నాడు. భయాందోళన సృష్టించాలని.. మాచర్ల ఒక చక్కటి ఉదాహరణ. కారుపై దాడి చేసి, ఉమాపై దాడి చేశారు. పోలీస్​ స్టేషన్​లో పుట్టిన రోజు వేడుకలు జరిపి, మున్సిపల్​ ఛైర్మన్​ పదవిస్తే ఎక్కడకు వెళ్తోంది ఈ రాష్ట్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయవాడకు వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు అందరం కలిసి ఆయన దృష్టికి తీసకువేళ్దామని అనుకుంటున్నాము."- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిసి పోరాడదాం:పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి.. పదవి నుంచి దిగిపోయాక బురఖా కప్పుకుపోతాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ఏ రూపేణా నిరసన తెలపకుండా పోలీసుల్ని కాపలా పెట్టడం దుర్మార్గానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఓ దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే, తప్పని చెప్పక పోగా వైసీపీ నేతలు ఆ ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్​పై విడుదలైన ఎమ్మెల్సీకి సన్మాన వేడుకలు నిర్వహించి సమాజానికి ఏం చెప్తున్నారని నిలదీశారు. అధికార పార్టీకి పూర్తిగా లొంగిపోయిన పోలీసులు.. పరువు తీస్తున్నారని విమర్శించారు.

ప్రజలే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే పరిస్థితి వస్తుంది: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కలసికట్టుగా ఆపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలకే భయపడిపోయే ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ప్రజలే ప్రభుత్వానికి నోటీసులిచ్చే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రజా ఉద్యమాలు కాపాడుకోవడం అందరి బాధ్యత అని అందుకు సీపీఎం మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.

వైసీపీ దుందుడుకు చర్యల్ని ప్రతిఘటించకపోతే ప్రజలు నష్టపోతారు:ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో విచ్చలవిడిగా మారిందని జనసేన నేత కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దుందుడుకు చర్యల్ని ప్రతిఘటించకపోతే ప్రజలు నష్టపోతారన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే రాజకీయ పక్షాలతో జనసేన కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. అఖిల పక్షం రూపొందించే కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలుకు కలిసి కృషి చేద్దామన్నారు. అనంతబాబు చేసిన హత్యతో దళితుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే అమలాపురంలో అల్లర్లు రేపారని ఆరోపించారు.

దుర్మార్గ పాలన పైనే కాకుండా అభివృద్ధి కోసం కూడా పోరాడాలి :జగన్​ను నమ్మి మద్యనిషేధం ప్రచార కమిటీ చైర్మన్​గా ఉన్నానని జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. దుర్మార్గ పాలన పైనే కాకుండా అభివృద్ధి కోసం కూడా పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో టీచర్లు, ఉద్యోగులు జీతాలు పడితే చాలు అనుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలోకి డిప్యుటేషన్​పై రావాలంటే గతంలో పోటీ పడేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు.

హక్కుల పరిరక్షణకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం:బలాన్ని అంచనా వేయకుండా నిర్ణయాలు వద్దని జనసేనకు సూచిస్తున్నట్లు జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ​ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని జనసేనను కోరుతున్నట్లు తెలిపారు. హక్కుల పరిరక్షణకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం అని తెలిపారు. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేది.. ఎస్సీ, ఎస్టీలే అని వెల్లడించారు. 'గడప గడపకు దగా' పేరిట రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

నేరస్థులే పాలకులైతే పౌరహక్కులు ఎక్కడ ఉంటాయి :రాజహింసను ప్రోత్సహించే చర్యలు దేనికి సంకేతం అని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రశ్నించారు. నేరస్థులే పాలకులైతే పౌరహక్కులు ఎక్కడ ఉంటాయని నిలదీశారు. పోలీసుల చేతగానితనంతోనే అనంతబాబుకు బెయిల్ వచ్చిందని మండిపడ్డారు. బెయిల్‌ కోసం ప్రభుత్వం అదనపు ఏజీని దిల్లీ పంపిందని ఆరోపించారు. ఏసీబీ, జేసీబీ, పీసీబీ సాయంతో ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహించారు. ఐఏఎస్‌లు అయ్యా ఎస్ అంటున్నారని ఎద్దేవా చేశారు.

రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు పోరాడదామని కాంగ్రెస్‌ నేత నరసింహరావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అఖిలపక్షం నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని తెలిపారు. ఎన్నికలలోపే జగన్‌కు ముగింపు పలకాలని రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శోభనాద్రీశ్వరావు సూచించారు. భారత్‌లో ఏపీ అంతర్భాగం కాదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై సీజేఐకు వినతిపత్రం ఇవ్వానున్న ప్రతి పక్షాలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details