Old Autos Scam: తెలంగాణలోని నగర రహదారులపై నడిచే పాత ఆటోలు కొందరు రవాణాశాఖ అధికారులు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. కొందరు అధికారులు తుక్కు పద్దు కింద పాత వాటిని రాసేసి కొత్తవాటికి అనుమతులిస్తున్నారు. తుక్కుపేరుతో ఉన్న ఆటోలు యథాప్రకారం నడుస్తున్నాయి. దీన్ని ఆటోడ్రైవర్ల యూనియన్లు వెలికి తీయడంతో రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో స్క్రాప్ ఆటోల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపేశారు.
ఇలా జరుగుతున్నాయ్..రుణాలిచ్చే ఫైనాన్షియర్లు పాతఆటోలపై దృష్టిసారించారు. పదిహేనేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటోడ్రైవర్ల అడ్రసులు సేకరిస్తున్నారు. వారి నుంచి తక్కువకు ఆటో కొని, రవాణాశాఖ అధికారులతో కుమ్మక్కై కొత్త ఆటోలను కొని ఫైనాన్స్ కింద ఇస్తున్నారు.