YCP Government Removing Old Age Pension: వృద్ధాప్యంలో పని చేయలేని పరిస్థితి, మందులతోనే నడిచే బతుకు బండి, పిల్లల చూసినా చూడకపోయినా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పింఛనే వారికి ఆధారం. అలాగే ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రభుత్వ సాయం పెద్ద భరోసా. అలాంటిది ఉన్నట్లు ఉండి పింఛన్లు తీసేస్తున్నాం అంటే వారి పరిస్థితి ఏంటి.? భూములు ఉన్నాయని, కరెంట్ బిల్లు ఎక్కువ కాల్చుతున్నరంటూ చెప్పడం సాకులు కాక ఇంకేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీవోడు ఇచ్చినప్పటి నుంచీ పింఛన్ తీసుకుంటుంటే ఇప్పుడు ఒక్కసారిగా కడుపు కొట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ నిలిపివేస్తున్నామంటూ సచివాలయ సిబ్బంది ఇస్తున్న నోటీసులతో పండుటాకులు మనోవేదనకు గురవుతున్నారు. కొందరైతే అసలు విషయం చెప్పకుండానే సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రేషకార్డులో పేరు సరిగా లేదని, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పడంతో పింఛన్‌దారులు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. విద్యుత్ కార్యాలయాల వద్ద సమస్య పరిష్కరించుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. కొందరికి భూములు లేకపోయినా ఉన్నాయని నోటీసులివ్వడంతో ఎక్కడ ఉన్నాయో చూపించాలని నిలదీస్తున్నారు.
భర్త చనిపోవడంతో 20 ఏళ్ల నుంచి విజయవాడ సింగ్ నగర్ లో నివాసం ఉంటున్న లింగం వెంకటలక్ష్మీ పింఛన్ తీసుకుంటున్నారు. పెన్షన్ తొలగిస్తున్నామని సచివాలయ సిబ్బంది వచ్చి నోటీసు ఇవ్వడంతో ఈమెకు ఆందోళన ఎక్కువైంది. తమను రోడ్డున పడేస్తారా అని కన్నీటి పర్యంతమవుతున్నారు. -లింగం వెంకటలక్ష్మి, విజయవాడ
పింఛన్లు తొలగిస్తున్నామని చెప్పకుండానే సచివాలయం సిబ్బంది కొందరి వద్ద వేలిముద్రలు వేయించుకుని నోటీసులు ఇస్తున్నారు. హఠాత్తుగా పింఛన్లు నిలిపివేస్తే తమ పరిస్ధితి ఏంటని పండుటాకులు ఆవేదన చెందుతున్నారు. -పింఛన్ లబ్ధిదారు, విజయవాడ