NTR's image on one hundred rupee silver coin: నందమూరి తారక రామారావు తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక.. ఆయన రూపం సమ్మోహనం, సుమనోహరం, అభినయ వేదం, ఆయన నటనకు విశ్వవిద్యాలయం.. తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం.. తెలుగుజాతికి ఐక్యతా చిహ్నం.. వెండితెరవేల్పు, మేలుకొలుపు, ప్రేక్షకుల ప్రపంచానికి ఆయన ఓ ఆరాధ్యదైవం, తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం, సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం.. ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం.
ఆకర్షించే ఆహార్యం.. ఆకట్టుకునే అభినయం.. అలరించే గళం.. వెరసి తెలుగు సినిమాకు ఆయన ఓ వరం. నటనతో పాటు రాజకీయంలోనూ కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి పేరిట నాణెం ముద్రణ చేయడం తెలుగు ఖ్యాతిని మరింత పెంచడమే. ఎంతో మందికి ఆదర్శవంతుడై ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన నందమూరి ఎందరికో చూపించాడు దారి.
ఈ నేపథ్యంలో తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ తెలుగు ప్రజలకు కేెంద్రం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండి నాణెం ముద్రణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన మింట్ అధికారులు ఆమె నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.