NTR Statue Inauguration in Pokkunuru : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు, పొక్కునూరు గ్రామాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, నల్లగట్ల స్వామిదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ తదితరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రూ.200 నుంచి 2వేలకు పెరిగిన కరెంట్ బిల్లు : రాష్ట్రంలో మరోసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే పనులు లేక తెలంగాణకు వెళ్లి పోవాల్సిందే అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కరెంట్ చార్జీలపై సీఎం జగన్మోహన్ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధం, సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. గత నాలుగున్నర ఏళ్లలో కరెంటు చార్జీలను విపరీతంగా పెంచాడు. 2 వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2 వేల రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లినా స్వయంగా నిరూపిస్తామని, నిరూపించలేకపోతే రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.
High Electricity Bill: రెండు ఫ్యాన్లు, బల్బులు.. బిల్లు చూస్తే షాక్
రాష్ట్రంలో శాంతి భద్రతలు :రాష్ట్రంలో పంచభూతాలను సీఎం జగన్ దోచుకున్నాడని, రాష్ట్రంలో విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ ఎంపీ సత్య నారాయణ భార్యను, కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే పరిస్థితికి శాంతి భద్రతలు దిగజారాయని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. విజయవాడ హైవే నుంచి పోక్కనూరు రావడానికి గతుకుల రోడ్డుపై రెండు గంటలు పట్టింది. అమరావతి రాజధానిని సీఎం జగన్ సర్వనాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.