Gampalagudem collapsed Bridge : కట్లేరు వాగుపై ఎన్నో గ్రామాలను కలిపే కీలక వంతెన అది. ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు అదో వారధి. ఇంతటి కీలకమైన వంతెన కుప్పకూలి... ఐదేళ్లయినా ఇంతవరకూ అతీగతి లేదు. తాత్కాలికంగా అప్రోచ్ రహదారి (Approach road) నిర్మించడం, వర్షానికి కొట్టుకుపోవడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం.ఇక్కడ 26 కోట్ల రూపాయలతో వంతెననిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.
BRIDGE: ఇది ప్రజలు నిర్మించుకుంటున్న వారధి.. ఎక్కడో తెలుసా?
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం - వినగడప గ్రామాల మధ్య ఉన్న ఈ వంతెన 2018లో కుప్పకూలింది. దీంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఖమ్మం, భద్రాచలం, ఇతర ప్రాంతాల నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రావాలంటే ఈ వంతెన వారధిగా ఉండేది. ఇటు విజయవాడ, నూజివీడు, చీమలపాడు వంటి ప్రాంతాలకు, అటు తిరువూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఎ.కొండూరు వంటి ప్రాంతాలకు రాకపోకలు జరుగుతుంటాయి. వంతెన ఐదేళ్ల క్రితం కూలిపోవడంతో పట్టించుకున్న వారు కరవయ్యారు. తాత్కాలికంగా పలుమార్లు కట్లేరు వాగుపై అప్రోచ్ రహదారి నిర్మిస్తున్నప్పటికీ వర్షాలకు వాగు పొంగి కొట్టుకుపోతోంది. ఈ ఐదేళ్లలో వాగు ఉద్ధృతికి పలుమార్లు అప్రోచ్ రహదారి కొట్టుకుపోయింది. ప్రస్తుతం తాత్కాలిక రహదారిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో అటు, ఇటు వెళ్లే వాహనాలు (Vehicles) ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నాయి. గంటల తరబడి తమ వంతు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.