No Sagar Water to NTR District: వాన జాడ లేదు.. ఆదుకుంటాయనుకున్న సాగర్ జలాలు విడుదల కావడం లేదు. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే ఏమి చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో ఎన్టీఆర్ జిల్లా రైతులు అల్లాడుతున్నారు. పంటలపై ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు.. ఈ విపత్కర పరిస్థితుల్లో నీటికోసం సతమతమవుతున్నారు. ఆఖరి ప్రయత్నంగా ఎక్కడో దూరాన ఉన్న బోర్లకు కిలోమీటర్ల దూరం మేర పైపులు వేసి సాగునీరు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నాగార్జున సాగర్ కింద 4.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలన్నీ ఎండుతున్నాయి. మిర్చి పంట దారుణంగా దెబ్బతినగా.. పత్తి పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశముంది. రైతులు జులై, ఆగస్టులో కురిసిన వర్షాలతో చాలావరకు పంటలను కాపాడుకున్నారు.
Water Crisis: సెప్టెంబరు నుంచి సాగునీటికి కొరత ఏర్పడింది. మిర్చి పంట ఎండిపోగా సస్యరక్షణకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల మొక్క పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆశలు వదులుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 25వేల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. నెల నుంచి తీవ్ర వర్షాభావానికి తోడు నాగార్జున సాగర్ జలాశయం నుంచి చుక్కనీరు రాక కాల్వలు ఎండిపోయాయి.
ఈ వారంలో ఎంతో కొంత తడిపెడితే తప్ప మిర్చిపంట బతికే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. ఒక్కొక్క రైతు మిర్చి పంటపై ఎకరాకు లక్ష నుంచి లక్షా50వేల వరకు ఖర్చు చేశారు. తీరా పంట దుస్థితి చూసి చలించిపోతున్నారు. పత్తిపంటకు వర్షాభావాన్ని తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ.. పూత, పిందె దశలో నీరు అవసరమని చెబుతున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలని రైతులు వేడుకుంటున్నారు.