Government Imposed Cut In Ration Goods : పేదల ఆకలి తీర్చడంలో రేషన్ దుకాణాల పాత్ర కీలకం. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలకు రేషన్ దుకాణాలే జీవనాధారంగా ఉన్నాయి. ప్రధానంగా భూమిలేని పేద కుటుంబాలు, కూలీ పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్న కుటుంబాలకు ఆసరాగా నిలిచే చౌకధర దుకాణాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇంటింటికీ వాహనాలు పెట్టి రేషన్ అందజేస్తున్నా పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత ప్రభుత్వాల హయాంలో అందజేసే నిత్యావసర సరుకుల్లో భారీగా కోత పెట్టారు.
రేషన్ సరుకుల్లో కోత :విజయవాడ నగరంలో చాలా ప్రాంతాల్లో కేవలం బియ్యం, అర కేజీ పంచదార మాత్రమే అందజేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర సరుకులు ధరలు పెరడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ప్రజలు చెబుతున్నారు. గత టీడీపీ, అంతకముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేషన్ డిపోల్లో సుమారు 6నుంచి 9 రకాల సరుకులు అందజేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిలో కోత పెట్టింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పే సంక్షేమం ఇదేనా అని పేద ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఉపయోగం లేని ఇంటింటికీ రేషన్ వాహనాలు:గతంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, పంచదార, గోదుమలు, సబ్బులు, చింతపండు, వంటనూనె వంటి తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందజేసేవారు. విజయవాడ వంటి నగరాల్లో ఈ తొమ్మిది రకాల సరుకులతో పాటు కూరగాయలు సైతం చౌకధర దుకాణాల్లో అందజేసే వారని నగర ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ రేషన్ వాహనాలు పెట్టి రేషన్ అందజేసినా.. పేదలకు పెద్దగా ఉపయోగం చేకూరడం లేదని చెబుతున్నారు.