fire incident in telangana new secretariat: తెలంగాణ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా చిన్నపాటిదేనని, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని స్టోర్ రూం మినహా ఎక్కడా నష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ప్రారంభ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సచివాలయ పనుల వేగవంతంపై సర్కార్ దృష్టి సారించింది. రహదార్లు, భవనాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిన్న రాత్రి పనుల పురోగతిని పరిశీలించారు. రాత్రి పది గంటల వరకు సచివాలయంలో కలియతిరిగిన మంత్రి తుది దశ పనులను ఆరా తీశారు. మిగిలిన పనుల వేగవంతం, నిర్దేశిత గడువులోగా పూర్తి పై చర్చించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదం, ఆ ప్రభావంపై కూడా ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూం మినహా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని చెప్పినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఇంజనీర్లు, గుత్తేదార్లకు స్పష్టం చేశారు. పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఏం జరిగిందంటే: నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టోర్ రూంలో రెండో తేది అర్దరాత్రి 2గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది.. ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల తీవ్రత పెరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ ఆ లోపే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు చేరుకున్నాయి.