No Approach Road to Bridge on Wyra River at Damuluru: వంతెన నిర్మించడం కష్టమైన పని. కానీ, దానికి అప్రోచ్ రోడ్ వేయడం సులభం. కష్టమైన వంతెన నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లలోనే పూర్తి చేసింది. కానీ, తేలికైన అప్రోచ్ రోడ్‌ను వైఎస్సార్సీపీ సర్కార్ నాలుగున్నరేళ్లైనా నిర్మించలేకపోతోంది. ఎన్టీఆర్ జిల్లా దాములూరు వద్ద ఏటి కష్టాలు తొలగించేందుకు నిర్మించిన వంతెన, వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యంతో అక్కరకు రాకుండా పోతోంది.
అభివృద్ధి అంటే గిట్టని పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. వైరా ఏటిపై అలంకార ప్రాయంగా మిగిలిన ఈ వంతెన. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, వీరులపాడు మండలాలను కలుపుతూ దాములూరు వద్ద దీన్ని నిర్మించారు. 2015లో ఈ హై - లెవెల్ వంతెన నిర్మాణానికి పునాది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వేసింది. 6 కోట్ల 47 లక్ష రూపాయలతో 2017లోనే దీని నిర్మాణం పూర్తి చేసింది.
రోడ్ల పనులకు నిధులివ్వక చేతులెత్తేసిన ప్రభుత్వం.. రుణాన్ని ఆపేసిన బ్యాంకు
వంతెన నిర్మాణం పూర్తైనా రెండు వైపులా అప్రోచ్ రహదారి నిర్మాణం పూర్తి కాలేదు. నాలుగున్నరేళ్లుగా దీన్ని పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి తెద్దామనే ఆలోచనే వైఎస్సార్సీపీ సర్కార్ చేయలేదు. ప్రస్తుతం దిగువునున్న లో - లెవెల్ చప్టానే ప్రజలకు దిక్కైంది. అదీ ఇప్పుడు ధ్వంసమైంది. వర్షాలు, వరదలొస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
"వాగులో రోడ్డు గుంతలుగా ఉంది. 2017లో పూర్తి చేశారు. వంతెనకు రెండు వైపులా రోడ్డు లేదు. వంతెన మాత్రం పూర్తి చేశారు." - స్థానికుడు