జగన్ సాక్ష్యం లేకుండా మిగతా వారిని విచారించలేన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం Kodi Kathi Case : అక్టోబరు 25వ తేది 2018 సంవత్సరంలో విశాఖపట్నం విమానాశ్రయంలో.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. 2019 ఆగస్టు 13న ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కేసులో విచారణ షెడ్యూలు ఖరారు కోసం న్యాయస్థానంలో ఎన్ఐఏ శుక్రవారం మెమో దాఖలు చేసింది. అభియోగపత్రంలో మొత్తం 56 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. విచారణ కోసం సిద్ధం చేసిన జాబితాలో 10 పేర్లను పొందుపరిచింది. వారి విచారణకు షెడ్యూలు ఖరారు చేయాలని కోరింది. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం దీనిపై అభ్యంతరం తెలిపారు.
విచారించాల్సిన వారి జాబితాలో బాధితుడి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఎన్ఐఏ తరఫు న్యాయవాది తొలుత పదిమంది సాక్షులను విచారించాలని కోరారు. దీంతో జడ్జి ఆంజనేయమూర్తి ఎన్ఐఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో బాధితుడి సాక్ష్యం విలువైనది. అది లేకుండా మిగతావారిని విచారించలేము అని అన్నారు. కోర్టు టేప్‌రికార్డరుగా ఉండబోదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఫిర్యాదుదారైన సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్‌కుమార్‌ను విచారిస్తామని వివరించారు. జనవరి 31 నుంచి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.
"కోడి కత్తి కేసులో బాధితుడు జగన్మోహన్ రెడ్డి రావటం లేదు. దానిపైనే కోర్టు అభ్యంతరం తెలిపింది. బాధితుడు వచ్చిన తర్వాత సాక్ష్యులను తీసుకురావాలని తెలిపింది. అతడు రాకుండా మిగతా వారు వస్తే చెల్లదంది. జగన్మోహన్ రెడ్డిని తీసుకువస్తామని ఎన్ఐఎ తెలిపింది. తీసుకు వచ్చిన తర్వాత కేసు ముందుకు వెళ్తుందని కోర్టు తెలిపింది." -సలీం, పిటిషనర్ తరపున న్యాయవాది
ఈ కేసులో ఫిర్యాదుదారైన సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్‌కుమార్, బాధితుడైన జగన్‌ల వాంగ్మూలాలు తమకు ఇవ్వలేదని న్యాయవాది సలీం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అభియోగపత్రంతో పాటే ఆ వాంగ్మూలాలు జతచేశామని ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వివరించారు. అయితే అభియోగపత్రంతో పాటు ఇచ్చిన వాంగ్మూలాల్లో జగన్, దినేష్‌కుమార్ సహా మొదటి 12 మంది వాంగ్మూలాలు లేవని సలీం చెప్పారు. అలా ఎందుకు చేశారని.. అందరి వాంగ్మూలాలూ ఉండాలి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిందితుడి తరఫు న్యాయవాదికి అన్నీ అందజేస్తామని ఎన్ఐఏ తరఫు న్యాయవాది తెలిపారు. కోడికత్తి కేసులో నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ న్యాయస్థానం బెయిల్ ఏడోసారి నిరాకరించగా.. దీనిపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు నిందితుడు తరపు న్యాయవాది తెలిపారు.
ఇవీ చదవండి: