Illegal mining: వందల ఎకరాల్లో కొండలు, గుట్టులు మటుమాయమవుతున్నాయి...పోలవరం కాలువ గట్లు కనిపించకుండా పోతున్నాయి. చదును చేసిన భూముల్లో ఏకంగా పండ్ల తోటలు పెంచుతూ దర్జాగా దోచుకుంటున్నారు. ఇదీ ఎన్టీఆర్ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు.. కోర్టు ఆదేశాలు పట్టవు.. కలెక్టర్‌స్థాయి అధికారుల ఆదేశాలు బేఖాతరు.. వాహనాలు సీజ్ చేసినా మట్టి దందా ఆపేది లేదు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో అధికారపార్టీ నేతల అండదండలతో అక్రమదందా సాగిస్తున్నారు.
అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం.. చీకటిపడిందంటే చాలు.. మట్టి తరలించే లారీల మోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లిపోవాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు. కొత్తూరు తాడేపల్లి, నైనవరం, వెలగలేరు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై సమతా సైనిక్‌దళ్ ప్రతినిధి సురేంద్ర ఆధారాలతో సహా ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలు పరిశీలనకు ఎన్జీటీ ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయగా.. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన అధికారులను మట్టిమాఫియా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. మైనింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్లకుండా రోడ్లను ఎక్కడికక్కడ తవ్వేయడంతో వారు నడుచుకుంటూ వెళ్లి అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు మండలాల్లో అటవీభూములు, నీటిపారుదల శాఖ ,అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం వందలాది లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. 10 నుంచి 15 అడుగుల మేర లోతు తవ్వి మట్టిని తరలించారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మట్టి తవ్వకాలు చేపట్టినట్లు ఎన్జీటీ బృందం గుర్తించింది.....