దివ్యాంగులకు అండగా విద్యార్థులు - కొత్త టెక్నాలజీతో ఎన్నో సమస్యలకు పరిష్కరాలు New Technology for Disabled Persons : అవయవ లోపంతో బతకడం అంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారందరి సమస్యలను తమ సమస్యగా భావించారు కొందరు విద్యార్థులు. వాటికి పరిష్కారం వైపు ప్రయత్నాలు చేశారు. నిరంతర ప్రయత్నాల ఫలితంగా సాఫ్ట్‌వేర్ సహకారంతో వివిధ డివైజ్‌లు రూపొందించారు. వాటిని దివ్యాంగులకి తక్కువ ధరకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
చీకటి లోకానికి చదువుల వెలుగు.. బ్రెయిలీ లిపికి సాంకేతిక తోడు.. టైప్ రైటర్ నుంచి ప్రింటర్ల దాకా
వివిధ డివైజ్‌లు ప్రదర్శిస్తున్న విజయవాడకు చెందిన విద్యార్థులు అందరి మెప్పు పొందుతున్నారు. వీరు నగరంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ కోర్సులను చదువుతున్నారు. పాఠశాల స్థాయిలో నుంచే కొత్త ప్రయోగాలు చేస్తూ వీటిపై ఆసక్తి పెంచుకోవడంతో ఈ దిశగా అడుగులు వేశాం. క్రమంగా ఆ ఆసక్తియే నేడు దివ్యాంగులకు ఉపయోగపడే ఆవిష్కరణలు తయారు చేయడానికి బీజం పడిందని విద్యార్థులు తెలిపారు.
'శత్రు క్షిపణులను బోల్తా కొట్టించే టెక్నాలజీ ఇది'
నూతన ఆవిష్కరణలు చేయడానికి ఉపాధ్యాయులు సహకారం అందించేవారు. వారి శిక్షణలో ఇద్దరు విద్యార్థుల చొప్పున కలిసి ఒక్కో డివైజ్‌ని కనిపెట్టాము. చేతులు లేనివారు కళ్లతో చూసి కంప్యూటర్‌ని ఆపరేట్ చేసేలా తయారు చేశాము. ఇది ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్, వర్చువల్ మౌస్ కెమెరా సహాయంతో పని చేస్తుంది. - సందీప్, విద్యార్థి
మానవతా దృక్పథంతో తయారు చేసిన ఈ డివైజ్‌లను తక్కువ ధరకే అందించేందుకు కృషి చేస్తున్నాము. దృష్టిలోపంతో బాధపడేవారి కోసం ఐరిస్ విజన్ అనే కళ్లద్దాలను మా బృంద సభ్యులతో కలసి అభివృద్ధి చేస్తున్నాము. ఈ అద్దాలు అల్ట్రా-సోనిక్ సెన్సార్ ఆధారంగా పని చేస్తాయి. దృష్టి లోపం ఉన్న వారికి ఈ కళ్లదాలు ఎంతో ఉపయోగపడతాయి. - లోహిత, విద్యార్థి
ఇదే ఉత్సాహంతో మరో టీం వారు కెమెరాతో ఆబ్జెక్ట్ డిటెక్షన్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. మాట్లాబ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పరికరాన్ని తయారు చేశారు. కెమెరా ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కు మధ్య ఉన్న దూరాన్ని గుర్తించి సిగ్నల్ ఇస్తుంది. ఈ పరికరం సహాయంలో దివ్యాంగులు గమ్య స్థానాలకు సాఫీగా చేరుకోవచ్చు. ఇది ప్రమాదాలను నివారించేందుకు దోహదపడుతోంది. - ఎం. ప్రియా, విద్యార్థి
అంధులు డబ్బు నోట్లను గుర్తించడం చాలా కష్టం. ఇందుకోసం వినూత్న ప్రాజెక్టుని అభివృద్ధి చేశాము. ఇది దృష్టిలోపం ఉన్నవారు నిరంతరం అలర్ట్‌గా ఉండేలా చేస్తుంది. అధునాతన ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా కరెన్సీ నకిలీనా, మంచిదా అని గుర్తిస్తుంది. ఆ నోటు విలువ ఎంత అనేది ఆడియో ద్వారా దివ్యాంగులకు వినిపించేలా రూపొందించాము. - రూపేశ్, విద్యార్థి
అంధులు రోడ్డు దాటేటప్పుడు ఉపయోగించే చేతికర్రను సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించాము. మరో బృందం ఏడు గంటల బ్యాటరీ సామర్థ్యంతో నడిచే స్మార్ట్ విజన్ గ్లాసెస్‌ను ఆవిష్కరించి ప్రత్యేకత చాటుకున్నారు. తమ విద్యార్థులు తరగతి గదులుకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తున్నారు. దీంతో కళాశాల యాజమాన్యం మెుత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - బాలస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్, లయోలా ఇంజనీరింగ్ కళాశాల
వీరంతా మానవతా దృక్పధంతో దివ్యాంగుల కోసం తమ నైపుణ్యాలను వినియోగించుకుని పరికరాలను రూపొందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేసి తక్కువ ధరలకే అందిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ప్రతిభతో ఉన్నత స్థానాలను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కొత్త టెక్నాలజీలపై కేంద్రం దృష్టి.. ఏఐసీటీఈ ఆధ్వర్యంలో అమలుకు శ్రీకారం