Nara Lokesh Yuvagalam Padayatra In Old Krishna Dist: యువగళం పాదయాత్రతో బెజవాడ ప్రధాన కూడళ్లు అభిమానులతో కిక్కిరిశాయి. లోకేశ్‌కు సంఘీభావం తెలిపేందుకు జనం భారీగా తరలివచ్చారు. విజయవాడ ఏ కన్వెన్షన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కూతవేటు దూరంలో ఉన్న పటమట చేరుకునేందుకు నాలుగు గంటల పైనే పట్టింది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ ల నుంచి మహిళలు ఓపెన్ టాప్ వాహనాలు ఎక్కి.. జెండాలు ఊపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో రోజు విజయవాడలోని తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. ప్రజలు భారీగా పోటెత్తడంతో పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి చేరుకునేందుకు అర్ధరాత్రి సమయం పట్టింది. యాత్ర కొనసాగినంత వరకు దారిపొడవునా జనప్రవాహం కదం తొక్కింది. బాణ సంచాలు, భారీ గజమాలలతో అభిమానులు, పార్టీ శ్రేణులు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ, వారి నుంచి వినతులు స్వీకరిస్తూ లోకేశ్ ముందుకు కదిలారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముస్లింలు లోకేశ్ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం 5,400 కోట్ల మైనార్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిందని వివరించారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో నిరుద్యోగులు వినూత్న శైలిలో నిరసన చేశారు. జాబ్‌లు పోగొట్టి నిరుద్యోగులకు జగన్ ఉరి వేశారని లోకేశ్ వద్ద వాపోయారు.
Grand Welcome to Lokesh Yuvagalam: ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం..
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వారికి లోకేశ్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మహిళలు లోకేశ్‌కి హారతులతో నీరాజనం పలికారు. నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని.. మహిళల సమస్యల్ని పరిష్కరించాలని లోకేశ్‌కు వినతిపపత్రం అందజేశారు.
టీడీపీ ప్రభుత్వంలో మహిళల వంక చూడాలంటేనే భయపడే విధంగా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని లోకేశ్ మహిళలకు భరోసా కల్పించారు. మహిళలపై నమోదు చేసిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పిస్తామని ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు సబ్సిడీ ధరలపై ఇళ్ల స్థలాలు అందజేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
విజయవాడ నగరాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని నారా లోకేష్ మండిపడ్డారు. నగర అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రహదారులు ఎటుచూసినా గుంతలమయంగా మారాయని ధ్వజమెత్తారు. కనీసం డ్రెైనేజీలో మురుగు తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వీఎంసీ నిధులను జగన్ సర్కారు లాగేసుకుందని ఆరోపించారు.