Nara Lokesh Reaction On Chandrababu Bail: సత్యం గెలిచింది, అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. 'సత్యమేవజయతే' అని మరోసారి నిరూపితమైందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేశారు. జగన్ కనుసన్నల్లో వ్యవస్థల మేనేజ్మెంటుపై సత్యం గెలిచిందని, చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తల ఎత్తుకుని నిలబడిందని ఉద్ఘాటించారు. తాను తప్పు చేయను, తప్పు చేయనివ్వనని బాబు ఎప్పుడూ చెప్పేదే మరోసారి నిజమైందని లోకేశ్ గుర్తుచేశారు.
చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, జగన్ కోసం, జగన్ వ్యవస్థల ద్వారా బనాయించిందన కేసులే అని లోకేశ్ విమర్శలు గుప్పించారు. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు. అరెస్టు చేసి 50 రోజులకి పైగా జైలులో పెట్టి కనీసం ఒక్క ఆధారమూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయినా.. వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయన్నారు. కేసులో ఆరోపించినట్టు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని లోకేశ్ పేర్కొన్నారు.
నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం: ఏపీ హైకోర్టు
అచ్చెన్నాయుడు: చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్వాగతించారు. అక్రమ కేసులపై మా పోరాటం ఫలించిందని స్పష్టంచేశారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైందన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి బుద్ది తెచ్చుకుని కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తారని తెలిపారు.