Nara Lokesh on cyclone rehabilitation: మిగ్‌జాం తుపానుతో అతలాకుతలం అవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి తాము అండగా ఉంటామంటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో పాటుగా, ఆయన కుటుంబం ముందుకు వచ్చింది. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ చంద్రబాబునాయుడు డిమాండ్ చేయగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని నారా లోకేశ్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా, ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్, ఈ సారి కూడా తన వంతు సాయానికి సిద్దమైందని నారా భువనేశ్వరి తెలిపారు.
మిగ్‌జాం తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరమైన ఆహారం, నీళ్లు, పునరావాసం కల్పించడంలో, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తుపానుపై ప్రభుత్వానికి సన్నద్ధత లేదన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సాయం చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మిగ్‌జాం తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరితో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టలేదని, ప్రభుత్వ స్పందన సరిగా లేదని బాధితులు చంద్రబాబుకు విన్నవించుకున్నారు.
సుడిగాలి బీభత్సం - అతలాకుతలమైన రాజమహేంద్రవరం
నారా లోకేశ్: మిగ్‌జాం తుపాను నష్టం అపారంగా ఉందని, ఆపద సమయంలో ప్రజలకి తెలుగుదేశం శ్రేణులు అండగా నిలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తుపాను తీవ్రతపై వారం నుంచే కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయని తెలిపారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించకపోవడం దారుణం అన్నారు. తుపాను పై అప్రమత్తం చేయడంలోనూ, సహాయకచర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. అనేక చోట్ల ప్రజలు ఇంకా వరద ప్రాంతాల్లో గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా మానవతాదృక్పథంతో తెలుగుదేశం శ్రేణులు, తుపాను సహాయకచర్యలలో పాల్గొనాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఓ వైపు వర్షం - మరోవైపు తీవ్రమైన గాలులు ఉన్న నేపథ్యంలో అన్నిజాగ్రత్తలు తీసుకుని వరద బాధితులకు ఆహారం, ఇతరత్రా సాయం అందించాలని తెలుగుదేశం కేడర్‌కు నారా లోకేశ్ సూచించారు.
మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - నిలిచిన ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్‌వర్క్
నారా భువనేశ్వరి: మిగ్‌జాం తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి అన్నారు. పెద్ద ఎత్తున ప్రజల ఆస్తి, పంట నష్టం బాధ కలిగిస్తోందని తెలిపారు. చేతికొచ్చిన పంట నీటి పాలైన రైతన్నల బాధ వర్ణనాతీతమని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు. తీవ్ర తుపాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేసారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ఈ సారి కూడా తన వంతు సాయానికి సిద్దమైందని వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఆపన్నులకు ట్రస్ట్ ద్వారా సాయం చేస్తామని భువనేశ్వరి స్పష్టం చేసారు. చేతనైన సాయంతో ఊరట కల్పిస్తామన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని భువనేశ్వరి కోరారు.
తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం - బాధితులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలి : చంద్రబాబు