Nara Lokesh on Bandaru Arrest: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని హైడ్రామా నడుమ పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఉద్రిక్తతల నడుమ ఆయనకు.. 41A, 41B నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. తొలుత అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు..కొద్దిసేపటి తర్వాత ప్లాన్ మార్చి అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలించారు.
Nara Lokesh Tweet on Bandaru Arrest: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. బండారు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ముందుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ..''వైఎస్సార్సీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలంతా కూసే రోత బూతు కూతలపై పోలీసులు ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు. వైసీపీ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా..? ఇదేం అరాచక పాలన' అని ఆయన సామాజిమ మాధ్యమాల వేదికగా నిలదీశారు.
Achchennaidu Fires on YCP Leaders: తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు అప్రజాస్వామికమని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హద్దులు మీరి వ్యవహరిస్తున్న వైసీపీ నేతలను కట్టడి చేయకుండా.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు బద్దలు కొట్టి, అరెస్ట్ చేసే అంత నేరం బండారు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వేధింపులు, కక్ష సాధింపులే అజెండాగా పాలన కొనసాగిస్తున్న జగన్‌కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు.