Lokesh Meeting On Yuvagalam: ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. యువగళం పాదయాత్ర నిర్వహణపై పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారికి న్యాయం జరిగేలా పోరాడతానని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వేంటనే సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.
151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చేయవచ్చన్నారు. ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్.. సద్వినియోగం చేసుకోలేదని లోకేశ్ మండిపడ్డారు. కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని లోకేశ్ తెలిపారు. అందుకే ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ రెడ్డి చెత్త పరిపాలన గురించి విమర్శిస్తున్నారన్నారు.
వార్ ఒన్ సైడ్ అయిపొయింది. ప్రజలంతా మన వైపు ఉన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేరు.. జగన్ రెడ్డిపై ప్రజల్లో ద్వేషం కనిపిస్తోంది.. మూడున్నర ఏళ్లుగా మనం ఒక సైకోపై పోరాడుతున్నాం. తెలుగుదేశం పార్టీకి అధికారం, ప్రతిపక్షం కొత్త కాదు.. ఎన్నో ఇబ్బందులు పడ్డాం -లోకేశ్