EAMCET Third Ranker Umesh Varun: ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ విద్యార్థి చల్లా ఉమేష్ వరుణ్ సత్తా చాటాడు. నందిగామకు చెందిన చల్లా విశ్వేశ్వరరావు, దేవకీదేవి కుమారుడు ఉమేష్ వరుణ్ తెలంగాణ ఎంసెట్లో మూడో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్న ఉమేష్‌కు తెలంగాణ ఎంసెట్లో మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆరో తరగతి నుంచే గుంటూరు భాష్యం స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. అనంతరం భాష్యం కళాశాలలోనే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో 983 మార్కులు సాధించాడు. ఐఐటీ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ క్యాటగిరిలో 263 ర్యాంకు కూడా సాధించాడు. బిట్స్ పిలాని నిర్వహించిన పరీక్షలో 360 మార్కులు గాను 328 మార్కులు సాధించి సత్తా చాటాడు. ప్రస్తుతం గుంటూరు భాష్యం కళాశాలలో ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
"చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మా అబ్బాయికి మూడో ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి అన్నింటిలో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంటర్లో 983 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్ ఓపెన్‌లో 263 ర్యాంకు వచ్చింది. బిట్స్‌లో 360 మార్కులకు 328 సాధించాడు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా భాష్యం విద్యాసంస్థల్లోనే చదివాడు. మంచి ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే సాధన చేస్తున్నాడు"-చల్లా విశ్వేశ్వరరావు, ఉమేష్ వరుణ్ తండ్రి