NTR As Chief Minister Of AP : తెలుగు నేల అతడి వెంట నడిచింది. నలువైపులా జనవాహిని పరవళ్లు తొక్కింది. చైతన్య రథ సారథికి చెయ్యెత్తి జేకొట్టింది. గతమెంతో ఘనకీర్తి కల వెండితెర ఆరాధ్యుణ్ణి.. రాజకీయ యవనిక మీద అన్నగారిగా అభిమానించి.. హృదయ పూర్వకంగా స్వాగతించింది. ఎటు వెళితే అటు జన సందోహం.. పోటెత్తి.. 'ఓటెత్తి'. మహా నాయకుడికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. ఈ ధరిత్రి మీద నూరేళ్ల చరిత్ర కలిగిన పార్టీనే.. మట్టి కరిపించిన ఆ చరితార్ధుడు నందమూరి తారకరామారావు. ప్రజాక్షేమం కోసం సాహసాలు చేసిన సంక్షేమ రాముడి.. అలనాటి ప్రజా పట్టాభిషేకానికి నేటికి నలభై ఏళ్లు.
'నందమూరి తారక రామారావు అను నేను ..'అని.. ఆయన మొట్టమొదట ప్రజా సమక్షంలో చేసిన ప్రమాణాన్ని జగమంతా ఆలకించింది. జనమంతా ఆస్వాదించారు. ఆనాటి అపురూప ఘట్టానికి నేటికి 40 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ పెట్టి ..దుష్పరిపాలనకు కారణాలు కనిపెట్టి.. వాటి పనిపట్టాడు. 97 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగిన అపూర్వ సమయం.
వెండితెర అభినవ రాముడు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం:1983 జనవరి 9 పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన తారీఖు. వెండితెరపై ఆరాధ్యుడిగా వెలిగిపోయిన నటరత్న నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టం. ఆయన వెండితెర నుంచి రాజకీయ యవనిక మీదికి మారారు. అక్కడా అగ్ర కథానాయకుడు.. ఇక్కడ రాజకీయ రంగానా అగ్రాధిపత్యమే. మాటలతో మంట పుట్టించి, పదాలు దట్టించి, కాక పుట్టించి, పౌరుషాగ్ని రగిలించి, జనాన్ని అదిలించి, కదిలించి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జనస్మృతి పథం నుంచి ఎలా మాయమవుతాడు. అక్షరాలు చెరిపేస్తే, చరిత్ర చెదిరిపోతుందా? చెరిగిపోతుందా? ఆకర్షణీయ రూపం స్మృతిపథం నుంచి తొలగి పోతుందా?
మహానియంతనే ఓడించిన సింహబలుడు: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ అధిపతిగా జనం మెచ్చిన జనపతి, ప్రబోధాత్మక సినిమాల దళపతి.. ఎన్టీఆర్‌ను మర్చిపోవటం తేలికా? అది సంక్షేమానికి రాజముద్ర. అతడు మహానియంతనే ఓడించిన సింహబలుడు. రాజకీయాన్నే మార్చి, సంక్షేమం అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన మహోన్నతుడు. ఆయన తెచ్చిన సంస్కరణలను విశ్లేషించి.. ఉపదేశించిన తారక మంత్రాన్ని కొత్త తరాల కోసం సమీక్షించుకోవాలి.
దిల్లీకి సలాం కొడుతూ.. మోకరిల్లిన రాష్ట్ర ముఖ్యమంత్రులు: కొన్ని ముద్రలు పడితే కలకాలం ఉంటాయి. వదలించుకోవటం ఒక పట్టాన సాధ్యం కాదు. మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చేసినా.. మద్రాసీలనే అవాంఛిత ముద్ర. తెలుగూ తెల్లారింది. తెలివీ తెల్లారింది. తెలుగు జాతి చేవలేనట్లు పడివుంది. ఇదేమీ పట్టని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అమాత్యులు దిల్లీకి సలాం కొడుతూ.. మోకరిల్లారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి తులాభారాలు, సత్కారాలు.
ఎవడబ్బ సొమ్ము అని ఎన్టీఆర్ ఎంట్రీ: ఆయన తర్వాత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య.. ఎయిర్ పోర్టులో ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అవమానించినా పట్టింపే లేదు. అవమాన భారాలయినా, తులాభారాలయినా దేనికైనా సిద్ధపడే తత్వం. పదవుల కోసం లాబీయింగ్‌లు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు తెల్లవారితే దిల్లీ పయనం. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస. అంజయ్య జుంబో జెట్ క్యాబినెట్లో 61 మంది మంత్రులు. రవీంద్ర భారతి, పబ్లిక్ గార్డెన్‌కూ ఓ మంత్రి. ఇవి చాలవన్నట్లు కార్పొరేషన్ పదవుల పందేరం. ప్రజాధనం వృథా.. అప్పుడే ఎవడబ్బ సొమ్మని ఖర్చుపెడుతున్నారంటూ ఎన్టీఆర్ నిలదీశారు. నిప్పులు చెరిగారు. జనంలో కట్టలు తెగే ఆగ్రహం.
రాజకీయాల్లోకి అగ్గిరాముడు ప్రవేశం: అధికార పార్టీలో అస్థిరత. ఒకే పార్టీలో ప్రబలిన ముఠాతత్వం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టయ్యింది. రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రులు మారుతున్నారు. ఆ నాలుగేళ్లలో నలుగురు మారారు. పంటలు పండక, అప్పులు తీరక రైతుల ఆత్మహత్యలు, పనులు లేక, జరుగుబాటు లేక కూలీల వలసలు.. యువతకు కొలువుల్లేవు.. విద్యార్ధులు మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలన్నా డొనేషన్ల దోపిడీ ఎక్కువ. పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులుండేవి. వ్యవసాయాలు ఎత్తుబడ్డాయి. వ్యాపారాలు మందగించాయి. ఏ వర్గమూ సంతోషంగా లేదు. సరిగ్గా అప్పుడే తారకరాముడు అగ్గిరాముడిలా వచ్చేశారు. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
తెలుగుదేశం పార్టీ స్థాపన:1982 మార్చి 29హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. సుముహూర్తం మధ్యాహ్నం రెండున్నర గంటలు. ఎన్టీ రామారావు.. పొలిటికల్ ఎంట్రీ రామారావు. నటరత్న నందమూరి తారక రాముడు.. రాజకీయాల్లోకి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌లో నిజాం కళాశాలలో బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు.
"హరిజన గిరిజన, దళిత వర్గం, గూడేల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ వుంటే చూచి భరించలేక, వెనుక బడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతుంటే, గుండె బద్దలై, మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను’'అన్న ఎన్టీఆర్ పలుకులు తెలుగు వారి మనసు తాకాయి.