Mutyalaraju attended hearing court case: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, స్థలాన్ని ఆక్రమించి వేడుకలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ షేక్ సిలార్ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. సర్వేచేసి, పాఠశాల స్థలంలో ఆక్రమణలు ఉంటే తొలగించాలని, ప్రహరీ నిర్మిచాలని 2020 నవంబర్ 3న అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు, తదితరులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో షేక్ సిలార్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు.
న్యాయస్థానం ఆదేశాలతో గత డిసెంబర్ 29న ముత్యాలరాజు, తదితర అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాల అమలు కోసం తీసుకున్న చర్యల వివరాల రికార్డులను తమ ముందు ఉంచాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఉండ్రాజవరం తహశీల్దార్‌ను ఆదేశించారు. విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తూ అధికారులు హాజరుకావాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ఇతర అధికారులు తాజాగా జరిగిన విచారణకు హాజరయ్యారు.