ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముందుకు సాగని మచిలీపట్నం నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు.. నిధులు మట్టిపాలు

MUNICIPAL OFFICE WORKS STOPPED : మచిలీపట్నం నగరపాలక సంస్థ భవన నిర్మాణం అర్థంతరంగా నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని ప్రస్తుత పాలకులు పట్టించుకోకపోవడంతో నాలుగేళ్లుగా పనులకు గ్రహణం పట్టింది. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగా... అదంతా వృథాగా మారింది. శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత భవనంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది భయపడుతూనే విధులు నిర్వహిస్తున్నారు.

MUNICIPAL OFFICE WORKS STOPPED
MUNICIPAL OFFICE WORKS STOPPED

By

Published : Jan 30, 2023, 9:19 AM IST

MUNICIPAL OFFICE WORKS STOPPED : మచిలీపట్నం విస్తరణను దృష్టిలో ఉంచుకుని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 5 కోట్ల రూపాయలతో అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. కౌన్సిల్‌లో తీర్మానం చేసి 2 కోట్లు వెచ్చించి.. పోర్టు రోడ్డులోని ట్రావెలర్స్ బంగ్లా స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు బేస్‌మెంట్‌ స్థాయి దాటి గోడల వరకు వచ్చాయి. తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా పనులు నిలిపేశారు.

అధికారంలోకి వస్తే ఈ భవనాన్ని మరింత ఉన్నతంగా నిర్మిస్తామని వైసీపీ నేతలు హమీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఈ భవనానికి ఒక్క ఇటుకా పేర్చిన దాఖలాలు లేవు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరింది. పాత భవనంలో విధులు నిర్వహించాలంటే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే నగరవాసులు... శిథిల భవనం కావడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. కార్పొరేషన్ భవనం నిర్మాణం పూర్తిచేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే... ఆ దిశగా ‍ఒక్క అడుగు వేయలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా అడవిని తలపిస్తోంది. నాలుగేళ్లు దాటడంతో గోడలు పగుళ్లు ఇస్తున్నాయి. నిర్మాణ సామగ్రికి తుప్పు పడుతోంది. ప్రభుత్వం భవన నిర్మాణ పనులు నిలిపేయడం దుర్మార్గమని... భవనాన్ని పూర్తిచేస్తే నగర ప్రజలకు ఉపయుక్తంగా ఉండేదని విపక్ష నేతలు పేర్కొంటున్నారు.

నగరపాలక సంస్థ భవన నిర్మాణం పూర్తయితే టీడీపీకు పేరు వస్తుందనే ఉద్దేశంతో.. వైసీపీ నేతలు పనులను అడ్డుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. అధికార పార్టీ సభ్యులు నిర్మాణ పనులు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే 2 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు పూర్తిచేసి... త్వరితగతిన అందుబాటులోకి తేవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details