MP Kesineni Nani Viral Comments: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రజలంతా తనతో బాగానే ఉన్నారని ఎంపీ కేశినేని స్పష్టం చేశారు. తాను ఒక ఎంపీ అని.. మహానాడుకు ఆహ్వానం అందలేదని.. అక్కడ రామ్మోహన్‌కు తప్ప ఇతర ఎంపీలకు పని లేదని వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం పెట్టారని.. కానీ ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారని తెలిపారు.
దిల్లీకి పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారని.. అది తన బాధ్యత కాబట్టి వెళ్లి అధినేతను కలిసినట్లు వివరించారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ పొత్తుపై స్పందించే స్థాయి తనది కాదన్నారు. అభివృద్ధి విషయంలో తాను పార్టీలను చూడనని స్పష్టం చేశారు. ప్రజల్లో తనకు మంచి పేరున్నందునే అన్ని పార్టీల్లో తన పేరుపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదని.. ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచిస్తా ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
"విజయవాడ ప్రజలంతా నాతో బాగానే ఉన్నారు. నేను ఒక ఎంపీని.. అక్కడ రామ్మోహన్‌కు తప్ప ఇతర ఎంపీలకు పని లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం పెట్టారు. ఎంపీగా నాకు ఆహ్వానం లేదు.. అచ్చెన్నాయుడు వెళ్లారు. దిల్లీకి చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. బాధ్యతగా వెళ్లి మా అధినేతను కలిశా. బీజేపీ, టీడీపీ పొత్తుపై స్పందించే స్థాయి నాది కాదు" కేశినేని నాని, విజయవాడ ఎంపీ
కేశినేని చిన్నిపై వ్యాఖ్యలు: అంతకుముందు జనవరి 15న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ దివంగత నాయకుడు కొంగర కాళేశ్వరరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సందర్భంలో కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ పోటీ చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ పోటీ దారుడిగా ఉండవచ్చని, సీటు ఆశించవచ్చని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడైనా, లేకపోతే క్రిమినల్స్ కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు.
నందిగామ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ (చిన్ని) యాక్టివ్‌గా ఉన్నారని, మీరు యాక్టివ్‌గా లేరని విషయాన్ని ప్రశ్నించగా.. పార్టీలో ఎవరైనా యాక్టివ్‌గా ఉండొచ్చని.. ఎవరైనా పని చేసుకునే అవకాశం ఉందన్నారు. కేశినేని చిన్నికి సీటు ఇస్తే మీరు సహకరిస్తారా అని ప్రశ్నించగా.. చస్తే అతనికి సహకారం చేయనని స్పష్టం చేశారు. క్రిమినల్స్‌కి, కాల్ మాఫియా, ల్యాండ్ మాఫియా లాంటి వాళ్లకు టికెట్లు ఇస్తే ఎందుకు సహకరిస్తామని ఎదురు ప్రశ్నించారు. తన తమ్ముడుతో పాటు మరో ముగ్గురుకి సీటు ఇస్తే తాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించనని తేల్చిచెప్పారు. పార్టీ సీట్లు ఇచ్చే విషయం అధిష్ఠాన నిర్ణయం ప్రకారం జరుగుతుందని కేశినేని నాని స్పష్టం చేశారు.