Road Accident in Vijayawada: విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో అర్ధరాత్రి స్థానిక ఎమ్మెల్సీ కారు బీభత్సం సృష్టించింది. బైక్ టాక్సీ నడుపుతున్న పారుపల్లి లక్ష్మణరావు అనే యువకుడు హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికున్ని ఎక్కించుకొని బస్టాండ్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదగా రామవరప్పాడు కూడలిలో దింపడానికి వెళుతుండగా.. అదే రోడ్లో అతివేగంగా వస్తున్న ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు వెనక నుంచి బైక్ను ఢీకొట్టగా.. బైక్ నడుపుతున్న లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనకాల ఉన్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రున్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు ప్రమాదానికి గురైన వెంటనే దానిపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ను తొలగించారు. కార్ సెన్సార్ బ్లాక్ కావడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును గుణదల స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
"ఈరోజు ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో బీఆర్టీఎస్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. రాపిడోలో పని చేసే వ్యక్తి.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని తీసుకొని రామవరప్పాడు వైపు వెళ్తుండగా.. బీఆర్టీఎస్ రోడ్డులో ఆ బైక్ను ఓ కారు వెనుకనుంచి ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు మరణించగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నాం. ఈ ప్రమాదంపై కేసు నమోదైంది"-కృష్ణ మోహన్, గుణదల సీఐ