MLC Kavitha Fires On BJP: దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో నిన్నంతా సీబీఐ విచారణ ఎదుర్కొన్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లో జరిగిన తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పద్ధతి ప్రకారం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించిన ఆమె.. ఇలాంటి పరిస్థితుల కారణంగానే కవులు, రచయితలు మౌనంగా ఉండిపోతున్నారని చెప్పారు. దేశంలో అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కవిత తెలిపారు.
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చేస్తున్న బెదిరింపులకు భయపడేదిలేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్న ఆమె.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో.. దేశంలో మరో ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.