MLA Vasantha Krishna Prasad sensational comments: ''వైసీపీలో రానూరానూ చెడ్డీ గ్యాంగ్‌లు, బెల్ట్ బ్యాచ్‌లు, తొట్టి గ్యాంగ్‌లు తయారయ్యాయి. విపక్షాలను విమర్శించే ధైర్యం లేదు. కోతిమూకలు సొంత పార్టీలో చేసే చర్యల్ని పట్టించుకోవద్దు. నిజమైన వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండండి'' అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
మైలవరంలో స్వపక్షంలోనే విపక్షాలు తయారయ్యాయి.. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఈరోజు ఎంపీఎఫ్సీ గోడౌన్, కేడీసీసీ బ్యాంక్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడూతూ.. వైసీపీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న నేతలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే విపక్షాలు తయారయ్యాయని.. రానూరానూ పార్టీలో చెడ్డీ గ్యాంగ్, బెల్ట్ బ్యాచ్, తొట్టి గ్యాంగ్‌లు తయారయ్యాయని ధ్వజమెత్తారు. విపక్షాలను విమర్శించే ధైర్యం లేక.. కొన్ని కోతిమూకలు సొంత పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్నాయని, అటువంటి వారి చర్యల్ని పట్టించుకోవద్దని.. పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతు తెలుపుతున్నానని అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై 12వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన చరిత్ర వసంత కృష్ణ ప్రసాద్‌కు ఉందన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ఓటమి ఎరుగని నాయకుడని.. పక్క నియోజకవర్గాల జోలికి వెళ్లకుండా, ఆయన పనేదో ఆయన చూసుకుంటారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసం అవసరమైతే సొంత డబ్బులను వెచ్చిస్తారని వ్యాఖ్యానించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి ఆయనతో నడుస్తూ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీలోని గ్రూపుల వర్గపోరు మరోసారి బట్టబయలు అయ్యిందని.. జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. మంత్రి జోగి రమేష్‌ను దృష్టిలో ఉంచుకునే వసంత ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మైలవరం వైసీపీలో గత కొంతకాలంగా నెలకొన్న వర్గపోరుతో తన ప్రత్యర్ధి, మంత్రి జోగి రమేష్‌పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర విమర్శలకు దిగటం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి