Minister Peddireddy Ramachandra Reddy: దరఖాస్తు చేసిన ప్రతీ రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అందించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత విద్యుత్ కోసం వచ్చే దరఖాస్తులకు ఎటువంటి తుది గడువు ఉండకూడదని పెద్దిరెడ్డి వెల్లడించారు. వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని డిస్కిం లకు మంత్రి సూచించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి, కనెక్షన్లు మంజూరు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు సుమారు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయానికి అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్: మరోవైపు జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుద్దీకరణను నిర్ణేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. సీపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చేటటువంటి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే టెండర్లు, అవార్డుల స్థాయిలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.