Jogi Ramesh Followers Attacked Pilgrims : దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న యాత్రికులపై మంత్రి జోగి రమేష్ అనుచరులు దాడికి తెగబడ్డారు. వారు వెళ్తున్న బస్సులను.. ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్న కార్లను అడ్డుగా పెట్టి, విజయవాడ జాతీయ రహదారిపై బస్సులను నిలిపివేసి దౌర్జన్యానికి దిగారు. మహిళలని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. డ్రైవర్‌తో గొడవ పడి బస్సును ఆపేయించారు. బస్సులో ఉన్న యువకులపై దాడి చేసి విలువైన సెల్‌ఫోన్ లాక్కున్నారు. మీ అంతు చూస్తామంటూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యాత్రికులు.. తేరుకుని, పోలీసులకు ఫోన్ చేశారు.
జరిగింది ఇది :పల్నాడు జిల్లా ఫిరంగిపురానికి చెందిన భక్తులు రెండు బస్సుల్లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దర్శనానికి వెళ్లారు. అదే ఆలయానికి ఇబ్రహీంపట్నంకు చెందిన 8 మంది యువకులు రెండు కార్లలో వచ్చారు. దైవదర్శనం చేసుకునే క్రమంలో.. అక్కడ బస్సులో వచ్చిన మహిళలు, యువతుల పట్ల యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తోటి భక్తులు వారిని వారించారు. ఈ సమయంలో స్వల్ప ఘర్షణ, వాగ్వాదం చోటుచేసుకుంది. వాహనాల పార్కింగ్ విషయంలోనూ బస్సుల డ్రైవర్‌తో యువకులు గొడవకు దిగారు.
అక్కడ వివాదం సద్దుమణిగినా బస్సులో భక్తులు తిరుగు ప్రయాణమవుతుండగా.. కారుల్లో వచ్చిన యువకులు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపై కాపుకాసి బస్సులను అటకాయించారు. కార్లు అడ్డుపెట్టి ఆపేశారు. అనంతరం బస్సులో ఉన్న వారిపై దాడికి దిగారు. తాము మంత్రి జోగి రమేశ్ అనుచరులమంటూ చంపేస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు. రెండు బస్సుల్లో ఉన్న మహిళలు, యువతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు ఫోన్ చేస్తామంటే ఓ యువకుడిని కొట్టి ఫోన్ లాక్కున్నారు. దాదాపు గంటసేపు బస్సులను జాతీయ రహదారిపై ఆపేసి.. హల్చల్ చేశారు.