Minister Botsa Meeting With Teachers Unions In Vijayawada : ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తోంది. సాఫీగా సాగాల్సిన ప్రక్రియను ప్రహసనంగా మార్చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో బదిలీల షెడ్యూల్ ఇచ్చిన ప్రభుత్వం కోర్టు కేసులతో ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. బదిలీల మారదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ ఉపాధ్యాయులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరికి ప్రభుత్వం ఉత్తర్వులను రద్దు చేసింది. మొదట బదిలీలు నిర్వహించాలా.. వద్దా? అనే మీమాంసతోనే కాలయాపన చేసింది. చివరికి ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో బదిలీలకు ఆమోదం తెలిపినా ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.
ఉపాధ్యాయులు 8ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5ఏళ్ల సర్వీసు పూర్తైతే తప్పనిసరి బదిలీ నిబంధన గతం నుంచి ఉంది. గతేడాది ఉపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసు పెట్టాలని మొదట భావించినా సంఘాల ఒత్తిడితో మళ్లీ మార్పు చేశారు. బదిలీల్లో 5ఏళ్లు, 8ఏళ్ల నిబంధన ఇప్పుడు ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2020 అక్టోబరులో బదిలీలు చేపట్టి 2021 జనవరి వరకు కొనసాగించింది. అప్పట్లో 4 నెలలపాటు బదిలీలు కొనసాగించారు. 2023-24 ఏడాదికి సంబంధించిన బదిలీలు ఎప్పుడు చేపడతారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత విద్యా సంవత్సరం పదోన్నతులను పూర్తి చేయలేక వాటిని సర్దుబాటుగా మార్చేశారు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించి, వారికి సర్దుబాటు కింద పోస్టింగులు ఇచ్చారు. పదోన్నతులు పొందిన వారికి అదనంగా నెలకు 2 వేల 500 భత్యం ఇస్తామని ప్రకటించినా ఇంత వరకు దీన్ని అమలు పరచలేదు. 4 నెలలకు సంబంధించిన భత్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
గత విద్యా సంవత్సరంలోనూ పాఠశాలలు పునఃప్రారంభం నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మొదట విద్యాశాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పి చివరకు డిసెంబరులో బదిలీల షెడ్యూల్ ఇచ్చారు. 2023 -24 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల్లోనే బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించినా ఇంతవరకూ విధివిధానాలు ఖరారు కాలేదు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు నిర్వహించడమే తప్ప బదిలీలకు సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదు. బదిలీల ప్రక్రియ చేపడితే వాటిని పూర్తి చేసేందుకు 30 నుంచి 4 0రోజులు పడుతుంది. ప్రస్తుతం మే నెల సగం రోజులు పూర్తయ్యాయి.