ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - పంట పొలాల్లో నిలిచిన వరద నీరు- రైతుల కళ్లలో కన్నీరు - Michaung Cyclone news

Michaung Cyclone affected Thousands Acres Crops Uprooted: అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం మిగ్‌జాం తుపాను పాలైంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రైతన్న నిలువునా మునిగాడు. కోతకు వచ్చిన వరి పైర్లు పూర్తిగా నేలవాలాయి. పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం రాసులు తడిసిపోయాయి. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

michaung_cyclone_affect_crops_uprooted
michaung_cyclone_affect_crops_uprooted

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 8:56 PM IST

మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - పంట పొలాల్లో నిలిచిన వరద నీరు- రైతుల కళ్లలో కన్నీరు

Michaung Cyclone affected Thousands Acres Crops Uprooted: ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వేలకు వేలు అప్పులు తెచ్చి, ఆరుగాలం కష్టించిన రైతులు పంటలు చేతికి అందకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. మరికొన్ని చోట్ల కోతలు కోసి, రాసులు పోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు.

తుపాను కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

NTR District: మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కట్టలేరు, పడమటి, ఎదుళ్ల, విప్ల, గుర్రపు, కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప సమీపంలో తాత్కాలిక వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో గంపలగూడెం-విజయవాడ మార్గంలో రెండు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం దాములూరు వద్ద వైరా, కట్టలేరు వాగులు పొంగిపొర్లడంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - నిలిచిన ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్‌వర్క్‌

500 Acres Paddy Fields Damaged : దాములూరు కూడలి వద్ద లోలెవెల్‌ కాజ్​వేపై వరద వస్తుండటంతో వీరులపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు మండలంలోని కూచి వాగుకు వరద పోటెత్తింది. విజయవాడలోని బీఎస్ఎన్‌ఎల్ (B.S.N.L) ఉద్యోగుల నివాస సముదాయంలో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి.

మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాసాగరంలో సెనగపాడు సప్లయ్‌ ఛానల్ కింద 1500 ఎకరాల్లో వరిపైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో భారీ వర్షాలకు పొలాల్లో మోకాలి లోతులో నీరు నిలిచింది. వేల రూపాయలు ఖర్చు పెట్టి వరికుప్పలు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోయారు.

Combined Guntur District: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. భారీ వర్షాలకు వేమూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రహదారుల పక్కన నిల్వ చేసుకున్న ధాన్యం తడిచిపోవడంతో వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే వరకు ఆగితే ధాన్యం మొలకలు వచ్చి నష్టపోయే ప్రమాదముందని రైతులు చెబుతున్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, అధైర్యపడొద్దు : మంత్రి కారుమూరి

Palnadu District: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అమరావతి మండలం పెదమద్దూరు వాగు పొంగడంతో అమరావతి-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. క్రోసూరు మండలం బయ్యవరం వద్ద లోలెవెల్ చప్టాపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంటపొలాలకు లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Krishna District: మిగ్‌జాం తీవ్ర తుపాను కారణంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి పొలాలను తెలుగుదేశం పార్టీ నియోజవర్గ ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకటరావు, ఇతర పార్టీ నాయకులు పరిశీలించారు. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో 62 వేల 600 ఎకరాల్లో వరి పంట సాగులో ఉండగా 35,500 ఎకరాల్లో వరి పంట పడిపోయినట్లు టీడీపీ నేతలు అంచనా వేశారు. సుమారు పది వేల ఎకరాల పంట తీవ్రంగా దెబ్బతిందని, ఇందులో సగం కూడా రైతులకు అందే పరిస్థితి లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Bapatla District: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తుపాను కారణంగా పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వేడుకుంటున్నారు.

'తుపాను ప్రభావం' ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం - అవస్థలు పడుతున్న రైతన్నలు

ABOUT THE AUTHOR

...view details