'రికవరీ ఏజెన్సీలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు' - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు
11:05 August 01
హరిత ఆత్మహత్య కేసు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హరిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎంఎస్‌ఆర్, ఎస్‌ఎల్‌వీ రికవరీ ఏజెన్సీకి చెందిన ఏడుగురు అరెస్టు అరెస్టు చేసిన పోలీసులు... వైద్య పరీక్షల నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రికవరీ ఏజెన్సీలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. నిబంధనలకు లోబడి ఏజెన్సీలు, బ్యాంకులు వ్యవహరించాలన్నారు. హరితను దూషించి మాట్లాడటం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. హరితవర్షిణి కేసులో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. పరువుకు భంగం కలిగేలా ఏజెంట్లు ప్రవర్తించారని... తండ్రి తీసుకున్న రూ.6 లక్షలు చెల్లించాలని వేధించారని అన్నారు. సీపీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఏజెన్సీలతో కౌన్సిలింగ్ నిర్వహించామని డీసీపీ చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది:ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని రైతుపేటలో జాస్తి హరిత వర్షిణి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వర్షిణి ఈఏపీసెట్‌లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు దిల్లీలో ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం తండ్రి ప్రభాకర్‌రావు... రెండేళ్ల క్రితం కరోనా సమయంలో విజయవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా క్రెడిట్ కార్డుపై మూడున్నర లక్షల రుణం తీసుకున్నాడు. ఇటీవల బ్యాంకు అధికారులు ఇంటివద్దకు అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో వర్షిణి బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ లేఖ ఆధారంగా, బాలిక తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ సీఐ కనకారావు తెలిపారు.
ఇవీ చదవండి: