AP CID officer Changed the word on chit fund case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఓ దుర్బుద్ధితో.. చిట్‌ఫండ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఆ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై కేసులు పెట్టి.. కొంతకాలంగా వేధిస్తున్నారు. తాజాగా మరోమారు విచారణ పేరుతో హడావుడి చేశారు. ఆ సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగటం, పొంతన లేని అంశాల గురించి ప్రస్తావిస్తూ.. సుమారు ఏడు గంటలపాటు విచారణ జరిపారు. విచారణకు ముందు 40 ప్రశ్నలు మాత్రమే అడుగుతామని చెప్పినా సీఐడీ అధికారులు.. రోజంతా కేవలం ఎనిమిది ప్రశ్నలనే అటు తిప్పి ఇటు తిప్పి అడిగారు. మధ్య మధ్యలో అవే ప్రశ్నలతో తికమక పెట్టే ప్రయత్నం చేశారు. అయినా, శైలజాకిరణ్ నింపాదిగా సమాధానాలు చెప్పారు.
మార్గదర్శి ఎండీ పూర్తిస్థాయిలో సహకరించారు..విచారణ అనంతరం శైలజాకిరణ్ నివాసం బయట ఏపీ సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు మార్గదర్శి ఎండీ పూర్తిస్థాయిలో సహకరించారని వ్యాఖ్యానించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేశారు. విచారణ ఇంకా జరగాల్సి ఉందన్న అధికారి.. తదుపరి విచారణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
మార్గదర్శి వ్యవహారంపై మాటమార్చిన సీఐడీ అధికారి.. చిట్‌ఫండ్స్ ఎండీ విచారణకు సహకరించలేదు..ఈ నేపథ్యంలో మార్గదర్శి వ్యవహారంపై ఈరోజు ఏపీ సీఐడీ దర్యాప్తు అధికారిరవికుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్ విచారణకు సహకరించలేదని, తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదంటూ మాటమార్చారు. తామడిగిన ప్రశ్నలకు 25 శాతం మాత్రమే సమాధానాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని విచారణ పూర్తైన తర్వాత ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు సమాధానంగా.. అప్పుడు కంగారులో ఉన్నామని రవికుమార్ చెప్పారు. దర్యాప్తులో సీఐడీ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. మార్గదర్శి చందాదారుల నుంచి ఇప్పటివరకు ఫిర్యాదులు అందలేదన్న ఆయన.. చిట్ రిజిస్ట్రార్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. సీఐడీ అధికారి రవికుమార్ మార్చిన మాటలు బట్టి చూస్తే.. కచ్చితంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలను అప్రతిష్ఠపాలు చేయడానికే విచారణను కొనసాగిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
విచారణ పేరుతో పన్నాగానికి తెర..మరోవైపు మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. శతవిధాలా ప్రయత్నిస్తూ.. చిట్‌ఫండ్‌కు చెందిన రూ.793.5 కోట్ల విలువైన సొమ్మును ఎటాచ్ చేసేందుకు ఇటీవలే జీవో జారీ చేసింది. అయినా, కూడా చందాదారుల్లో సంస్థపై ఎటువంటి నమ్మకం ఇసుమంతైనా సడలకపోవడంతో తాజాగా (మంగళవారం) మరోసారి విచారణ పేరుతో పన్నాగానికి తెరలేపింది. ఇప్పటికే చిట్‌ఫండ్ సంస్థపై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరిట ఎండీ శైలజాకిరణ్‌ను ఒకసారి విచారించిన ఏపీ సీఐడీ...నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మరోసారి విచారించింది.