ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicides of Students: పరీక్షలు తప్పామని.. ప్రాణం తీసుకున్నారు - ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలు

Suicides of Students: పరీక్షల్లో పాస్ కాలేదని, తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. కన్నోళ్లకి కడుపుకోత మిగిల్చారు. ఈ సారి ఖచ్చితంగా పాస్ అవుతాను అమ్మా అని చెప్పిన కుమార్తె.. ఉదయానికి విగతజీవిగా మారడంతో.. తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

Suicides of Students
విద్యార్థుల ఆత్మహత్యలు

By

Published : Apr 28, 2023, 1:52 PM IST

Student Suicides: పరీక్షల్లో పాస్ కాలేదని, తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. కన్నోళ్లకి కడుపుకోత మిగిల్చారు. ఈ సారి ఖచ్చితంగా పాస్ అవుతాను అమ్మా అని చెప్పిన కుమార్తె.. ఉదయానికి విగతజీవిగా మారడంతో.. తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత కాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 9 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఇద్దరు బలవన్మరణానికి యత్నించారు. దీంతో విద్యార్థుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పరీక్ష తప్పానని మనస్తాపానికి గురైన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్‌.. టెక్కలిలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులు కృష్ణారావు, దమయంతి రాజమహేంద్రవరంలో వలస కార్మికులు.

విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ అనే విద్యార్థిని ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కూలి పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తోంది. విశాఖ నగరంలోని పల్నాటి కాలనీకి చెందిన బోనెల జగదీష్‌.. గదిలో ఫ్యాన్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయన్న ఆవేదనతో అనకాపల్లికి చెందిన కరుబోతు తులసీకిరణ్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్‌ గ్రామానికి చెందిన మహేష్ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాయకపోవడంతో.. తల్లిదండ్రులు ప్రశ్నించారు. మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిదికి చెందిన విద్యార్థిని.. పరీక్షలో తప్పానని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు.. ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం గణితంలో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపానికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష అనే స్టూడెంట్.. గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అనూష ఇటీవల కర్ణాటకలోని అమ్మమ్మ ఊరికి వెళ్లింది. విద్యార్థిని తల్లికి ఫోన్‌ చేసి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు ఆమెకు తెలిపింది. రెండు రోజుల్లో వచ్చి పరీక్ష ఫీజు కట్టి.. ఈసారి పాస్ అవుతానని తల్లితో చెప్పింది. ఉదయం కుమార్తె మరణవార్త వినడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్‌ జాన్‌ సైదాకు గణితంలో ఒక్కొక్కటి, ఫిజిక్స్‌లో ఆరు, కెమిస్ట్రీలో ఏడు మార్కులు రావడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారుడి పరీక్ష పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని.. అతని మరణానికి అధికారులే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇదే జిల్లా చిల్లకల్లుకు చెందిన విద్యార్థి రమణ రాఘవ ఇంటర్‌ రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్టులో ఫెయిలవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరాల్లో కలిపి మూడు సబ్జెక్టులు తప్పాడు. మనస్తాపానికి గురైన అతను పురుగుల మందు తాగడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్​కి తరలించారు. ఇదే జిల్లా రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని చీమల మందు తాగడంతో రాజాం సామాజిక ఆసుపత్రిలో చేర్చారు.

విద్యార్థుల ఆందోళన:ఎన్టీఆర్ జిల్లా - నందిగామలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్ జాన్ సైదా ఆత్మహత్య ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాల వలన విద్యార్థి జాన్ సైదాకు ఫలితాల్లో ప్రధాన సబ్జెక్టులకు ఒకటి, రెండు మార్కులు మాత్రమే వేసి పంపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని.. వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details