Mango prices in market: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాల కారణంగా మామిడి కాయలు నేల రాలడంతో ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మామిడి ధర వ్యాపారులకు కాసులు కురిపిస్తుంటే.. కొనుగోలు దారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. గత వారం రోజులుగా మార్కెట్లలో మామిడి కొనుగోళ్లు తగ్గాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా వీచిన ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో డిమాండ్ తగ్గి సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో మామిడి ధరలకు రెక్కలొచ్చాయి. 15 రోజుల క్రితం వరకు బంగినపల్లి కాయలు డజను 300 రుపాయలు ఉంటే ఇప్పుడు 450 వరకు పెరిగాయి. ఆదే 60 కాయల బుట్ట గతంలో రూ.1200 వరకు ఉండగా నేడు రూ.1500 వరకు పలుకుతున్నాయి. రసాలు డజను 450 రుపాయలు నుంచి 700 రుపాయాల పైనే పలుకుతున్నాయి. 60 కాయల బుట్ట సైజును బట్టి 1800 రుపాయల వరకు పలుకుతున్నాయి. ఒక్కసారిగా ఇలా ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్నారు.
మార్కెట్‌లో మామిడి కాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు న్యాయం జరగడం లేదు కానీ వ్యాపారులకు మాత్రం డబ్బులు మిగులుతున్నాయని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట కావడంతో ఇంత రేటు ఉన్నా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయడం జరుగుతుందని వారు పెర్కొన్నారు. కాయ నాణ్యతను బట్టి వ్యాపారులు అమ్ముతున్నారు. మామిడికాయ పరిమాణాన్ని బట్టి ఒక్కొ కాయను వ్యాపారులు 150 రుపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇదేమని అడుగుతుంటే వర్షాలు వచ్చి పంట నష్టం వచ్చిందని అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారని వినియోగదారులు అంటున్నారు.