Man Suicide Attempt: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన ఎర్ర గొర్ల విజయ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కీసర గ్రామానికి చెందిన వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక, కంచికచర్ల పోలీస్ స్టేషన్లో విజయ్‌తో పాటు ఆయన తమ్ముడు పైన రౌడీషీట్ ఓపెన్ చేయడంతో.. మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా వెంటనే నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ముందు విజయ్ పురుగు మందు డబ్బా పట్టుకొని సెల్ఫీ వీడియో తీశాడు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గత మూడు నెలలుగా వైసీపీ నాయకుల ఆదేశాలతో కంచికచర్ల పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ఉండటంతో మానసికంగా తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన దీనికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విజయ్ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త. ఈ కారణంతోనే ఆయన పైన అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారు అని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.