Man Attack on Woman in Vijayawada : తనతో ప్రేమగా ఉంటూ.. సహజీవనం చేస్తున్న మహిళ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ నగర శివారు నున్న-ముస్తాబాద మధ్యలో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం సీఐ కనకారావు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ.. తన భర్త పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. బర్రె కిరణ్ తన భార్యతో కలిసి నగరంలోనే నివసిస్తున్నాడు. అతడు కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె.. వేరొకరితో వాట్సప్‌లో ఛాటింగ్ చేస్తుందని, ఫోన్లో మాట్లాడుతోందని బర్రె కిరణ్ అనుమానం పెంచుకున్నాడు. తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందని పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్న పథకం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో శిశు సంక్షేమశాఖ నగదును బ్యాంకు నుంచి తీసుకోవాలని మాయమాటలు చెప్పి ఆమెను వెంట తీసుకువెళ్లాడు. తన కారులో ఎక్కించుకుని విజయవాడ నగర శివారు నున్న వైపు పయనమయ్యాడు. మార్గ మధ్యలో కారును కృష్ణా జిల్లా గన్నవరం స్టేషన్ పరిధిలోని ముస్తాబాద, లంబాడీ పేట వైపు మళ్లించి.. ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపాడు. ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఆమెతో గొడవకు దిగాడు. ముందుగా అనుకున్న ప్రకారం వెంట తెచ్చుకున్న.. కత్తితో ఆమెపై దాడికి దిగాడు. చేతిపై, వీపుపై గాయాలు అయ్యాయి.