Sankranti Festival Story : సూర్యభగవానుడి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభించే దినమే మకర సంక్రాంతి. ఈ మూడు రోజుల ముచ్చటైన పండుగలో తొలిరోజు భోగి. ఇది దక్షిణాయనానికి తుది రోజు. పితృ దేవతారాధన దక్షిణాయనంలో ప్రధానం కనుక పాత వస్తువులను భోగిమంటల్లో దహనం చేసి దేవతారాధనకు అనుకూలమైన ఉత్తరాయణాన్ని ఆహ్వానిస్తాం. బదరీ వృక్షాన్ని (రేగుచెట్టు) విష్ణుమూర్తి ప్రతి రూపంగా భావించడం, పిల్లలకు భోగిపళ్లు పోయడం ఆచారం. తలమీద రేగుపళ్లను పోయడం వల్ల పరమాత్ముని ఆశీస్సులు ప్రత్యక్షంగా అందుతాయంటారు.
మహా పుణ్యకాలం..సూర్యుడు ధనూరాశిని వీడి మకరరాశిలో ప్రవేశించే శుభతరుణం మకర సంక్రాంతి. ఆ రోజున కొత్తబియ్యంతో పిండివంటలు వండి ప్రసాదంగా నివేదిస్తారు. దేవతలకు దక్షిణాయనం రాత్రి సమయం కాగా, ఉత్తరాయణం పగటి పూట. వారు సుప్తావస్థను వీడి చైతన్య స్థితిలో భక్తులను అనుగ్రహించే కాలమిది. అందుకే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై వేచి ఉన్నాడు. సంక్రాంతి నాడు కుంకుమ, ధాన్యం, బెల్లం, వస్త్రాలను దానం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది అËంటారు పెద్దలు. ధాన్యం ఇంటికి చేరే రోజులు కాబట్టి రైతులందరూ సంతోష సంబరాలతో పండుగ చేసు కుంటారు. హరిదాసులు, పగటి వేషగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు- ఇలా అనేక వృత్తులవారు నేలతల్లిని నమ్ముకున్న రైతులను ఆశ్రయిస్తారు. ఎవరినీ వట్టి చేతులతో పంపకుండా శక్తికొద్దీ దానం చేసి ఆనందాలు పంచే దృశ్యాలు కనువిందు చేస్తాయి.