Polavaram project: అన్నివిధాలుగా ఆదుకుంటామని మాటిచ్చిన సీఎం జగన్ మాట తప్పారని.... పోలవరం నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో మూడుసార్లు ముంపునకు గురైనా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పునరావాసం, 10 లక్షల ప్యాకేజీ సహా ఇతర హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టులో నీళ్లు నిలబెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులు చేపట్టిన మహా పాదయాత్ర జోరుగా సాగుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే "పోలవరం నిర్వాసితుల పోరు కేక " పేరుతో యాత్ర చేస్తున్నట్లు సీపీఎం నేతలు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంతో భూమి కోల్పోయిన తమకు భూమితోపాటు 10 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పిన వైసీపీ సర్కార్... కాలయాపన చేస్తోందని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరికి వరదలు వచ్చిన సమయంలో పోలవరం బాధితులను పట్టించుకోలేదని మండిపడ్డారు. మూడు నెలల పాటు వరదలతో నరకయాతన అనుభవించామని వాపోయారు. నామమాత్రంగా కొన్ని సరుకులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
పోలవరం బాధితుల ఆక్రందన కనిపించడం లేదా అని సీపీఎం నేతలు ముఖ్యమంత్రిని నిలదీశారు. పదే పదే పోలవరం ప్రాజెక్టు గురించే మాట్లాడటమే తప్ప..... నిర్వాసితుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత వరదల్లో 193 గ్రామాలు మునిగితే కేవలం 56 గ్రామాలనే పరిగణనలోకి తీసుకోవడం దారుణమన్నారు. నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 4న విజయవాడలో మహాధర్నా చేస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. 2013భూ సేకరణ చట్ట ప్రకారం18 ఏళ్లు నిండిన యువతను యూనిట్ గా పరిగణించి పరిహారం ఇవ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కాంటూరు లెక్కలని పక్కన పెట్టి నష్టపోయిన వారందరికి పరిహారం అందించాలని కోరారు. నిర్వాసితుల సమస్య తన బాధ్యత కానట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం దారుణమన్నారు.
గోదావరికి వరదలు వచ్చి ఇళ్లు, పొలాలు నీట మునగడంతో తాము రోడ్డున పడ్డామని పోలవరం ప్రాజెక్టు బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు అడవిలోనే ఉండిపోయామని, అకస్మాత్తుగా వరదలు రావడంతో ఖాలీ చేతులతో అడవిలోకి వెళ్లడం జరిగిందని చెబుతున్నారు. వరదల వల్ల అంటు రోగాలు ప్రబలి ఎంతో మంది చనిపోయారని వాపోతున్నారు. వైసీపీ నాయకులు ఓట్ల కోసం తమకు మాయ మాటలు చెప్పారని బాధితులు అంటున్నారు. తమకు కేటాయించి ఇళ్ల వద్ద నీటి వసతి లేదని, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహరం కూడా లక్ష 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. తమకు ఇచ్చిన పొలాలు కూడా వరదకు ముంపుకు గురవుతాయని ఇంకా పొలాలు ఇచ్చి ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
సీపీఎం ఆధ్వరంలో పోలవరం నిర్వాసితుల మహా పాదయాత్ర